ఆలస్యమే.. ప్రాణాలు కాపాడింది..!
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:56 AM
: ఆలస్యమైతే అమృతమే విషం అవుతుందని అంటారు పెద్దలు.. కానీ ఒక్కోసారి అదే ఆలస్యం మనకు మేలు చేస్తుంది. ఇటువంటి అనుభవమే తిరుపతి నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన ఓ బృందానికి ఎదురైంది.
తిరుపతి నుంచి వెళ్లిన మానస సరోవర యాత్రికులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
తిరుపతి సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఆలస్యమైతే అమృతమే విషం అవుతుందని అంటారు పెద్దలు.. కానీ ఒక్కోసారి అదే ఆలస్యం మనకు మేలు చేస్తుంది. ఇటువంటి అనుభవమే తిరుపతి నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన ఓ బృందానికి ఎదురైంది. యాత్రికులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన సైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా 28 మంది ఈనెల 21వ తేదీన మానస సరోవర యాత్రకు బయల్దేరారు. 22న నేపాల్ విమానాశ్రయంలో దిగి ఖాట్మండ్ హోటల్‌లో బసచేశారు. ఈ బృందానికి వీసా ఆలస్యం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తూ గడిపారు. వీసా వచ్చాక బుధవారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభించారు. ఈక్రమంలో త్రిశూలి బ్రిడ్స్‌కు వంద మీటర్ల దూరంలోనే వరద ముప్పుతో పెద్ద ఘోరం జరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పి ఎత్తయిన ప్రాంతానికి తీసుకెళ్లారు. కళ్లముందే వందల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. సమయానికి వీసా వచ్చి ఉంటే వీరు కూడా వరదలో కొట్టుకుపోయిన భవనంలో ఉండేవారు. త్రుటిలో ప్రమాదం తప్పడంతో వీరంతా ఊపిరిపీల్చుకున్నారు.
మాతోపాటు వీసా వచ్చిన 85 మంది గల్లంతు
28 మంది యాత్రికులతో ఈనెల 21వ తేదీన మానస సరోవర యాత్రకు యల్దేరాం. వీసా ఆలస్యం కావడం వల్ల బతికిపోయాం. లేకుంటే వరదలో కొట్టుకుపోయిన బిల్డింగ్‌లో ఉండేవాళ్లం. అంతేకాకుండా ప్రయాణం మధ్యలో డ్రైవర్ టీ బ్రేక్ తీసుకోవడం వల్లా వరద ముప్పుప్రాంతానికి మా బస్సు వంద మీటర్ల దూరంలో ఆగింది. మాతోపాటు వీసా వచ్చిన 85 మంది మాకంటే ఓ పది నిమిషాలు ముందు వెళ్లడంతో గల్లంతయ్యారు. ఈశ్వరుడి దయవల్ల మేమంతా సేఫ్.
- పెమ్మసాని వెంకటరమణ, సైన్‌ఇన్‌ట్రావెల్స్ అధినేత, తిరుపతి