హతమార్చింది సోదరుడే
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:02 AM
పెద్దపంజాణి మండలం మారపల్లి వద్ద ఈనెల 6వ తేది జరిగిన శ్రీనివాసులు హత్యను ఛేదించినట్టు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఈ వివరాలను మంగళవారం ఆయన పలమనేరు పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.
ఆస్తి వివాదంతోనే నాటు తుపాకీతో కాల్చిచంపిన నిందితుడు
పలమనేరు, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): పెద్దపంజాణి మండలం మారపల్లి వద్ద ఈనెల 6వ తేది జరిగిన శ్రీనివాసులు హత్యను ఛేదించినట్టు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఈ వివరాలను మంగళవారం ఆయన పలమనేరు పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. మారపల్లికి చెందిన శ్రీనివాసులుకు వరసకు తమ్ముడైన రామలింగంకు కొంత కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. దీంతో శ్రీనివాసులుపై పగ పెంచుకొన్నాడు. ఈనెల 6వతేది రాత్రి పొలం వద్ద శ్రీనివాసులు, నిందితుల్లో ఒకడైన ప్రకాష్ మద్యం తాగుతున్నారు. అక్కడికి తన స్నేహితులు తోటి నాగరాజు, రాజశేఖర్ అలియాస్ శేఖర్, మునిరాజుతో కలిసి రామలింగం వెళ్లాడు. తన వెంట తెచ్చుకొన్న నాటు తుపాకితో శ్రీనివాసులును రామలింగం కాల్చి చంపాడు. నాటు తుపాకిని, మద్యం బాటిల్‌ను, జర్కిన్‌ను సమీపంలోని కుంటలో పడేసి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెన్నారెడ్డిపల్లి క్రాస్ సమీపంలో మంగళవారం అనుమానాస్పద రీతిలో కనిపించిన నిందితులను సీఐ పరశురాములు, ఎస్‌ఐ సురే్‌షబాబు, సిబ్బందితో కలిసి పట్టుకుని అరెస్టు చేశారు.