Share News

అలా వదిలేశారు

ABN , Publish Date - May 23 , 2026 | 12:53 AM

గాలి వానకు నేలరాలిన మామిడికాయలను రైతులు అలానే వదిలేశారు

అలా వదిలేశారు
నేల రాలిన మామిడిని వదిలేసిన రైతులు

విజయపురం/నగరి, మే 22(ఆంధ్రజ్యోతి): విజయపురం, నగరి మండలాల్లో గురువారం సాయంత్రం గాలి వానకు నేలరాలిన మామిడికాయలను రైతులు అలానే వదిలేశారు. వ్యయప్రయాసల కోర్చి మార్కెట్‌కు తరలించినా గిట్టుబాటు కాదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరిద్దరేమో కాయలను ఏరి, మార్కెట్‌కు తీసుకెళ్లారు. విజయపురం మండలం శ్రీహరిపురం, మహారాజపురం, కోసలనగరం, పాతార్కాడు, జంబాడలో ఈ గాలి వానకు సుమారు 60 శాతం కాయలు రాలిపోయినట్లు అంచనా. రాలిన కాయలను మార్కెట్‌కు తరలించినా మంచి రేటు ఉండదని భావించారు. అందుకని చాలా మంది రైతులు రాలిన కాయలను మామిడి తోటలోనే వదిలేశారు. గాలి..వానకు రాలిన మామిడి కాయలను చిత్తూరులోని జ్యూస్‌ ఫ్యాక్టరీ వారు రూ.రెండుకే అడగడంతో నగరి మండలం రామాపురం, వెంగన్నకండ్రిగలోని రైతులు ఆవేదన చెందారు. కాయలను ఏరడానికి కూలీలకు ఇచ్చే డబ్బు కూడా రాదని తోటలో రాలిపోయిన కాయలను రొటవేటర్‌తో తొక్కించేశారు. ఈ రెండు గ్రామాలలోనే సుమారు 150 టన్నుల మామిడి కాయలు నేల రాలిపోయాయని రైతులు పరంధామనాయుడు, కపిల్‌, వెంకటేశులు తెలిపారు. గాలి వానకు దెబ్బతిన్న మామిడి చెట్లు, రాలిపోయిన కాయలను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ ఆదేశాలతో జిల్లా ఉద్యానశాఖాధికారి పవన్‌, స్థానిక సచివాలయ ఉద్యానవన అధికారి దీప శుక్రవారం పరిశీలించారు.

Updated Date - May 23 , 2026 | 12:53 AM