కురిసింది వాన..
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:03 AM
మదనపల్లె, కురబలకోటలో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. సాయంత్రం 5గంటల నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మదనపల్లె డివిజన్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం
భయపెట్టిన ఉరుములు, మెరుపులు
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం
మదనపల్లె, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మదనపల్లె, కురబలకోటలో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. సాయంత్రం 5గంటల నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. ముందుగా కురబలకోట మండలం అంగళ్లులో మోస్తరు జల్లులు కురవగా, తర్వాత మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు మొదలయ్యాయి. ఉరుముల శబ్దాలతో పల్లెలు, పట్టణ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. రామసముద్రంలో వాన భారీగా కురిసింది. కురబలకోట, అంగళ్లు, మదనపల్లెలో వర్షం కంటే ఉరుముల శబ్దాలు, మెరుపులు కొనసాగాయి. మదనపల్లె డివిజన్‌లోని మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో సాయంత్రం 5.30గంటలకే విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో పట్టణంతోపాటు పల్లెల్లో ఒకటిన్నర గంటకుపైగా అంధకారం నెలకొంది. బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లోనూ ఇదే తరహాలో ఉరుములు, మెరుపులతో గంటపాటు కురిసిన జడివానతో ప్రజలు, వాహనదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. మిగిలిన మండలాల్లోనూ గంటకుపైగా తుంపర్లతో మొదలైన వర్షం జల్లులతో కూడిన చినుకులు పడ్డాయి. రోడ్లు, కాలువలపై నీటి ప్రవాహం మొదలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎండుతున్న ఆరుతడి పంటలకు పదను కాగా, ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న జలానికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. కాగా, వర్షం ఆగిపోయినా తర్వాత కూడా గంటన్నరపాటు ఉరుములు, మెరుపుల పరంపర కొనసాగింది.