Share News

ఎన్నికలొస్తే కనిపించేది సైకిలే

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:42 AM

‘అంతా మంచివాళ్లు ఉన్నది కుప్పమేనని నేను నమ్ముతా. ఎన్నికలొస్తే ఇక్కడి ప్రజలకు కనిపించేది సైకిలే. సైకిలెక్కి ఓట్లు వేస్తారు. నేను అభివృద్ధి, సంక్షేమాన్ని ఇస్తున్నా. కూటమి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మాత్రం మీదే’ అని కుప్పం ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్నికలొస్తే కనిపించేది సైకిలే
సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

కుప్పం ఓటుతోనే అభివృద్ధికి ఊతం

కూటమి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదే

ఇక్కడ రక్తాభిషేకాలకు చోటు లేదు

బహిరంగ సభలో సీఎం చంద్రబాబు

కుప్పం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘అంతా మంచివాళ్లు ఉన్నది కుప్పమేనని నేను నమ్ముతా. ఎన్నికలొస్తే ఇక్కడి ప్రజలకు కనిపించేది సైకిలే. సైకిలెక్కి ఓట్లు వేస్తారు. నేను అభివృద్ధి, సంక్షేమాన్ని ఇస్తున్నా. కూటమి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మాత్రం మీదే’ అని కుప్పం ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో సోమవారం ఆయన రూ.38 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, రూ.289 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడే జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదు. నేరస్తులను ప్రోత్సహించే పార్టీ. హత్యలు, దాడులు చేసే పార్టీ. రేపటి ఎన్నికల్లో వాళ్లు ఒక్క వార్డు మెంబర్‌ కానీ, కౌన్సిలర్‌ కానీ గెలవకూడదు. అది గొడ్డలి పార్టీకి మరిచ్చే సమాధానం అవుతుంది. నేను మీ అందరి ఆమోదంతోనే అభ్యర్థులను నిలబెడతాను. గెలిపించుకునే బాధ్యత మీదే’ అని చంద్రబాబు అన్నారు. నారావారిపల్లె తనకు జన్మనిస్తే, కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని భావోద్వేగంతో అన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా కుప్పం కుటుంబాలలో తానూ ఒక సభ్యుడినేన్నారు. అందువల్ల కుప్పం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల గురించే నిరంతరం ఆలోచిస్తుంటానన్నారు.

ఎంతో అభివృద్ధి చేశాం

కుప్పంలో జీడీఏ 37 శాతం, తలసరి ఆదాయంలో 35 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు. ‘రూ.9,872 కోట్ల పెట్టుబడులతో 32 పరిశ్రమలు వచ్చాయి. 80,124 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. స్థానిక యువతకే కచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. నియోజకవర్గంలో 8,904 బంగార కుటుంబాలకు పీ4 ద్వారా ఆదాయ మార్గం చూపించి, జీవన ప్రమాణాలను పెంచుతున్నాం. 82 కేంద్రాల ద్వారా చెత్తను ప్రాసెస్‌ చేసి ఆదాయ వనరుగా మారుస్తున్నాం. చెత్తనుంచి సంపదను వృద్ధి చేసే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. చెత్తనుంచి విద్యుత్తు తయారు చేయడమూ ఇందులో భాగమే. కుప్పం నియోజకవర్గంలో 8 వేల ఇళ్లకు సోలార్‌ విద్యుత్తు ప్యానళ్లు అమర్చాం. వ్యవసాయానికీ దీనిని అమలు చేస్తాం. కుప్పం ఏరియా ఆస్పత్రి, 13 పీహెచ్‌సీలను కలిపి 1.25 లక్షల మందికి సంజీవిని ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.34 కోట్లతో 134 ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. కంగుందిలో ఇటీవల భూ వివాదాన్ని పరిష్కరించి 320 మందికి పట్టాలు పంపిణీ చేశాం’ అని చంద్రబాబు అన్నారు.

మోడల్‌ నియోజకవర్గంగా కుప్పం!

కుప్పాన్ని మోడల్‌ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.3.30 కోట్లతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ మెటీరియల్‌ రికవరీ ప్లాంట్‌ ప్రారంభించాం. యామగానిపల్లె, మాదనపల్లె ప్రాంతలో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళిక వేస్తున్నాం. కుప్పంలో 550కుపైగా మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పైపులైన్లతో అనుసంధానం చేస్తాం. పశు పోషణ, ఫౌలీ్ట్ర రంగాలలో ఉపాధి అవకాశాలను, ఆదాయ మార్గాలను పెంచుతున్నాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనతో రైతుల ప్రయోజనాలను, లాభాలను ద్విగుణీకృతం చేస్తాం. కుప్పం, పొగురుపల్లె, కేజీఎఫ్‌ మీదుగా బెంగళూరుకు, పలమనేరు నుంచి కృష్ణగిరికి ఫోర్‌లేన్‌ రోడ్లను నిర్మించి ఇతర నగరాలకు అనుసంధానం పెంచుతున్నాం. చిత్తూరు నుంచి కుప్పానికి రైల్వే బ్రాడ్‌ గేజ్‌ చేయడానికి ప్రణాళిక వేస్తున్నాం. త్వరలోనే విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నాం’ అని చంద్రబాబు తన ప్రణాళికలను వెల్లడించారు.

అభివృద్ధి కావాలా.. రౌడీయిజం కావాలా?

‘రక్తాభిషేకాలు చేస్తారట. చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలట. ఈ మాటలు కుప్పంలో వినడం విడ్డూరంగా ఉంది. మిమ్మల్ని చంపేవాళ్లు లేరు. చంపనిచ్చే వాళ్లూ లేరు. తోక విసిరితే కత్తిరిస్తాం’ అని ప్రతిపక్షంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వీళ్లను మెంటల్‌ అనాలా? సైకోలనాలా? అయిదేళ్లూ నేరస్తుల అడ్డాగా మార్చారు. ఇప్పుడు మీ ఆటలు చెల్లవు. ‘మీకు అభివృద్ధి కావాలా? రౌడీయిజం కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వేసే ఓట్లే వారికి గుణపాఠం కావాలి’ అని సూచించారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు ఇవీ

కుప్పం మున్సిపాలిటీలో రూ.3.30 కోట్లతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ మెటీరియల్‌ రికవరీ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం

నియోజకవర్గంలో రూ.15 కోట్లతో పీఎం కుసుమ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవం

35 పాఠశాలల్లో రూ.10 కోట్లతో మానవ సరోవర్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు ప్రారంభం

కుప్పంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న ఆధునిక రైతు బజార్‌ నిర్మాణానికి శంకుస్థాపన

రూ.13 కోట్లతో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయ సముదాయ భవనానికి శంకుస్థాపన

కుప్పం మున్సిపాలిటీలో రూ.8 కోట్లతో హై మాస్ట్‌ వీధి దీపాల ఏర్పాటు

కుప్పంలో రూ.184 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ యుటిలిటీ్‌సకు శంకుస్థాపన

బైరుగానిపల్లె వద్ద రూ.45 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

మల్లానూరులో రూ.2.7 కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు శంకుస్థాపన

నియోజకవర్గంలో రూ.16 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, హెరిటేజ్‌ గ్రానైట్‌ స్టోన్‌ క్లస్టర్‌కు శంకుస్థాపన

కుప్పం మార్కెట్టు యార్డులో రూ.2.5 కోట్ల పనులకు శంకుస్థాపన

మీరిచ్చిన స్ఫూర్తి.. మా బతుకులకు దీప్తి

సీఎం చంద్రబాబు ఎదుట లబ్ధిదారుల మాట

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో వారు సీఎం ఎదుట తమ అనుభవాలను పంచుకున్నారు. వారేమన్నారంటే..

- శాంతిపురం/గుడుపల్లె, ఆంధ్రజ్యోతి

కృష్ణా జలాలతో సాగుబాట

నీటి వనరుల్లేక ఏడెకరాల భూముల బీడు పెట్టుకునేవాడిని. గతేడాది కృష్ణాజలాలు రావడంతో మళ్లీ వ్యవసాయం గాడిలో పడింది. టమోటా, అరటి, బంగాళాదుంపలు పండించాను. ఏడాదికి అన్ని ఖర్చులూ పోను రూ.లక్ష ఆదాయం కళ్లజూస్తున్నా.

- శంకర్‌రెడ్డి, దండికుప్పం, శాంతిపురం మండలం

ఇటుకబట్టీ కూలీని.. పీ-4తో యజమానినయ్యా

ఇటుక బట్టీలో కూలిపని చేసేదాన్ని. పీ-4 ద్వారా టీవీఎస్‌ కంపెనీ అందించిన ఆర్థికసాయంతో సొంతంగా ఇటుక బట్టీ పెట్టా. నా వద్ద 8 మంది కూలీలను పెట్టుకున్నా. ఏడాదికి రూ.8 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఖర్చులన్నీ పోను రూ.4 లక్షలు మిగులుతోంది.

- వెంకటలక్ష్మి, కోటచెంబగిరి, గుడుపల్లె మండలం

స్కిల్‌ సెంటర్‌ శిక్షణతో ఉద్యోగంలో చేరా

డిగ్రీ చదివిన నేను ప్రభుత్వ స్కిల్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నా. జాబ్‌ మేళాలో.. మా ఊరిలో ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ చదువుతున్నా. పారిశ్రామికవేత్తగా ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ధ్యేయం.

- సురేఖ, పొగురుపల్లె, గుడుపల్లె మండలం

మా ఇంట ‘సూపర్‌ సిక్స్‌’ వెలుగులు

సూపర్‌ సిక్స్‌ పథకాలు మా కుటుంబంలో వెలుగులు తెచ్చాయి. తల్లికి వందనం కింద ముగ్గురు పిల్లలకు ఏటా రూ.45 వేలు వస్తోంది. మా ఆయనకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ20 వేలు, మా అత్తకు వితంతు పింఛను ఏడాదికి రూ.48 వేలు వస్తోంది. ఉచిత ప్రయాణంతో నాకు రూ.2వేల నుంచి రూ.3వేలు మిగులుతోంది. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్ల ద్వారా రూ.3 వేలు ఆదా అవుతోంది.

- సత్య, వానగుట్టపల్లె, కుప్పం మండలం

మీ ప్రేరణతో ఎదిగాను

చిన్నప్పటినుంచీ మిమ్మల్ని, మీరు కుప్పంలో చేస్తున్న అభివృద్ధిని చూస్తూ పెరిగాను. ‘కుప్పం ఆర్గానిక్‌’ పేరుతో శాంతిపురంలో చిన్న వ్యాపారం ప్రారంభించా. ఇప్పుడు దానిని ఏడు బ్రాంచిలకు విస్తరించా. స్వయం ఉపాధితో ఎదగాలన్న ఆకాంక్ష మీవల్లే నాకు కలిగింది.

- సుబ్రమణ్యం, చిన్నగాండ్లపల్లె, శాంతిపురం మండలం

Updated Date - Sep 22 , 2026 | 01:42 AM