వెంకటగిరిలో భూ కబ్జాలకు అంతే లేదా?
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:03 AM
రాజకీయ నేతల సహకారం, అఽధికారుల అండదండలు
తిరుపతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖరీదైన భూముల్లో కబ్జా పర్వం కొనసాగుతోంది. పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల భూమిని కొట్టేయాలని కొందరు పావులు కదుపుతుండగా మరోపక్క రియల్టర్లు చెలరేగిపోతున్నారు. లేఅవుట్ల నిర్మాణ నిబంధనలకు పాతరేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు అండదండలు, అధికారుల సహకారం లభిస్తున్నాయని ఇక్కడి ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ ఆరోపిస్తోంది. వెంకటగిరి పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమిపై వివాదం ముసురుకొంటోంది. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో వివరాల ప్రకారం అమ్మవారిపేటలో సర్వే నెంబర్ 199-5లో ఎకరా 32 సెంట్లు, సర్వే నెంబర్ 200-2లోని ఎకరా 29 సెంట్ల భూమిని అబ్దుల్ కరీం సాహెబ్ అనే వ్యక్తి నుంచి గతంలో వెంకటగిరి పంచాయతీ సమితి రూ.500లకు కొనుగోలు చేసింది. అప్పట్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది. కాలక్రమేణా ఈ భూమి విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కోట్లాది రూపాయలు పలుకుతోంది. ఈనేపథ్యంలో కొందరు వ్యక్తులు దీనిపై కన్నేశారు. తాము అబ్దుల్ కరీం సాహెబ్ వారసులమంటూ రంగంలోకి దిగారు. రెవెన్యూ రికార్డుల్లోని ఈభూమి హక్కుల్లో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకుని ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెంకటగిరి ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ నడుం బిగించింది. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డుల సేకరణకు ప్రయత్నిస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు స్పష్టంగా ఉన్నందున రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
రిజిస్ర్టేషన్ అక్కడ.. నిర్మాణం ఇక్కడ..!
వెంకటగిరి పట్టణంలోని తిరుపతి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామ కంఠం సర్వే నెంబరు 108-5కి చెందిన భూమిని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ సదరు వ్యక్తులు ఏకలవ్యనగర్ ప్రాంతంలో భవన నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫ రాపూరు రహదారి మార్గంలోని కైవల్యానది పరిధిలో ఓ లేఅవుట్‌కు సంబంధించి కొందరు నిబంధనలు బేఖాతరు చేసి ప్రహరీ నిర్మిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాల నిబంధనలను పట్టించుకోకుండా నిర్భీతిగా పనులు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
ఫ వెంకటగిరి మున్సిపల్ పరిధిలో పుట్టగొడుగుల్లా లేఅవుట్లు వెలుస్తున్నాయి. వందకుపైగా ఇలాంటివి ఉన్నట్లు సమాచారం. రాజకీయ నేతల అండదండలతో కొందరు రియల్టర్లు ఇష్టారాజ్యంగా ఈ లేఅవుట్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లేఅవుట్‌లో రోడ్డు, పార్కు, ఇతర ప్రజావసరాల స్థలాలను సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు భోగట్టా.
ఫఅక్రమ నిర్మాణాలు ఆసరాగా కొందరు దళారులు పెత్తనం చెలాయిస్తున్నారు. అనుమతులు ఇప్పిస్తాం, ఫైళ్లు క్లియర్ చేస్తామంటూ భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. వీరి అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పట్టణ ప్రణాళికకూ విఘాతం కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలపై చర్యలకు సిద్ధం
భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణ అంశాలు నా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఎవరైనా మా కార్యాలయానికి వచ్చి వివరాలు అందిస్తే వెంటనే రికార్డులు పరిశీలిస్తాం. చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు నిర్ధారణైతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.
- కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్