Share News

చేరువలో నీరున్నా చేరే దారేదీ?

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:25 AM

ప్రాజెక్టు నిర్మించినా రైతుల కల సాఫల్యం కాలేదు. సాగు నీరు చేరలేదు.

 చేరువలో నీరున్నా చేరే దారేదీ?
నిండు కుండను తలపిస్తున్న ఝరికోన ప్రాజెక్టు

రాయచోటి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టు నిర్మించినా రైతుల కల సాఫల్యం కాలేదు. సాగు నీరు చేరలేదు. కరువు ప్రాంతంలో సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. నిండా నీరున్నా కాలువలు నిర్మించకపోవడంతో సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఝరికోన ప్రాజెక్టు పేరు చెప్పగానే గుర్తొచ్చేది సంబేపల్లె మండలం. ఇక్కడి రైతుల ప్రయోజనాల కోసం 2006 జూన్‌లో బహుదా నదిపై 0.5 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు మంజూరు చేశారు. సంబేపల్లె, సుండుపల్లె, కేవీపల్లె మండలాల్లోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు, రాయచోటి ప్రాంతానికి 0.43 టీఎ్‌ఫసీ సామర్థ్యంతో తాగునీటి వసతి కల్పించేలా రూ.36 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టు 2009 నాటికి నిర్మాణం పూర్తయింది. లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా సంబేపల్లె మండలంలో 3,500 ఎకరాలు, రైట్‌ కెనాల్‌ ద్వారా కేవీపల్లె, సుండుపల్లె మండలాల్లోని 1,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సుండుపల్లె మండల రైతులు తూము(స్లూయిజ్‌) ఏర్పాటుకు పట్టుబట్టడంతో 350 క్యూసెక్కుల నీరు బహుదా నది పరీవాహక ప్రాంతంలో పారేలా గేటు ఏర్పాటు చేశారు.

ఆగిన కాలువ పనులు

2009 తర్వాత ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సంబేపల్లె, సుండుపల్లె, కేవీపల్లె మండలాల్లోని ఐదు వేల ఎకరాలకు సాగునీటి కోసం రైట్‌, లెఫ్ట్‌ కెనాళ్ల నిర్మాణానికి 2019లో రూ.47.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు ఏ మాత్రమూ సరిపోవని అప్పట్లో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. 2023లో రూ.123 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఎన్నికలు దగ్గర పడటం, 2024లో ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలకు కదలిక లభించలేదు. ప్రాజెక్టు నిండా నీళ్లున్నా కనీసం ఒక ఎకరాకు అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేరువలోనే నీరున్నా చేరే దారిలేకపోయిందంటున్నారు. 15 ఏళ్లు గడిచిన క్రమంలో తూము గేటు కూడా మరమ్మతులకు గురైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా కాలువలను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరముంది. దీనికి సంబంధించిన క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తున్నామని ప్రాజెక్టు జేఈ బాబు తెలిపారు.

Updated Date - Apr 08 , 2026 | 12:25 AM