బాహుదా ప్రాజెక్టు భద్రమేనా..?
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:43 AM
సాగునీటి ప్రాజెక్టు బాహుదాపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్షేత్రస్థాయిలో ఆలనాపాలనా కరువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
- మొరాయిస్తున్న గేట్లు, తూములు
- నిధుల కొరతతో కొరవడిన నిర్వహణ
- నేడు డ్యామ్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం రాక
సాగునీటి ప్రాజెక్టు బాహుదాపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్షేత్రస్థాయిలో ఆలనాపాలనా కరువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రాజెక్టు భద్రత, లోపాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సోమవారం జలవనరులశాఖ-హైడ్రాలిక్ ఇంజనీరింగ్ బృందం, సేఫ్టీ బృందం రానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
మదనపల్లె, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2,800 ఎకరాల ఆయకట్టుతో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉన్న బాహుదా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఆలనా, పాలనపైనే ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. గతేడాది నవంబరులో బాహుదా నిండిపోయింది. మిగులు జలాలను బయటకు పంపే ప్రయత్నంలో రెండో గేటు మొరాయించింది. మొత్తం ఆరుగేట్లు ఉండగా రెండు, నాలుగో నంబర్ గేట్లను కొంతమేర పైకిఎత్తి నీటిని బయటకు వదిలారు. రెండో గేటును ఎత్తేక్రమంలో ఒకవైపున సగంలో నిలిచిపోయింది. తర్వాత ఈతగాని సాయంతో గేటును అతికష్టం మీద కిందకు దింపగలిగారు. గేటుకు అటు, ఇటు వైపున ఉన్న (గ్రూస్) గాడికి, గేట్లను ఎత్తే ఇనుపతాడు(రోప్) గ్రీసింగ్ చేస్తూ రెండు, మూడు నెలలకోసారి మోటార్లు లేదా మ్యానువల్‌గా గేట్లను ఎత్తి పరీక్షిస్తుండాలి. లేకుంటే ఎండకు గ్రీసు ఆరిపోయి తప్పుపట్టి గాడిలో ప్లేటు ఇరుక్కుపోయే ప్రమాదముంది. మొన్నటి పరిస్థితి కూడా అదేనని చెబుతున్నారు. రెండోగేటు రోప్ లూజ్‌గానే ఉంది. సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు తాత్కాలికంగా పనులు చేయించడం, తర్వాత వదిలేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాజెక్టుకు అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదం జరిగితే నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కలికిరి మండలాల్లోని ప్రజలు, జీవాలు, ఆస్థులకు తీవ్రనష్టం కలగనుంది. గ్రూస్, రబ్బర్ సీళ్లు, లీకేజీలు, కట్ట కింది భాగంలో టో డ్రైన్‌లో లీకేజీలు పరిశీలించాలి. మరోవైపు గేట్లు ఎత్తడానికి విద్యుత్తు మోటార్లు ఉన్నా విద్యుత్తు సరఫరా లేనప్పుడు గేట్లు ఎత్తడానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. వీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి.
జూన్‌లో మొరాయించిన తూము గేటు
ప్రాజెక్టు ఎడమ కాలువకు అమర్చిన తూముగేటు(సర్వీసు గేటు) ఈ ఏడాది జూన్‌లో మొరాయించింది. దీంతో నీరు బయటకు రాక, అప్పటికే సాగులో ఉన్న వరి పంట ఎండిపోయింది. గేటునుపైకి లేపడానికి రైతులు అప్పట్లో పది రోజులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని రైతులు నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. కేవలం రెండు, మూడు తడులు నీరు పెడితే సాగులోని పంట చేతికొచ్చేది. కానీ తూము గేటు జామ్ అయిపోవడంతో చుక్క నీరు పంట కాలువకు వెళ్లలేదు. దీంతో పంట పశుగ్రాసంగా మారిపోయింది.
నీరులేని సమయంలో పనులు చేస్తేనే..
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్, రబీ సీజన్‌లో వర్షాలు ముఖం చాటేశాయి. ప్రాజెక్టులో చుక్కనీరు లేదు. ఇప్పటికే మొరాయించిన రెండు గేట్లతోపాటు ప్రాజెక్టు ఎడమ వైపున తూము గేటుదీ ఇదే పరిస్థితి. వీటి మరమ్మతులపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. తీరా వర్షం పడి, ప్రాజెక్టు నిండితే, గేట్లు మళ్లీ మొరాయించే అవకాశం ఉందని అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం సోమవారం ప్రాజెక్టును సందర్శించనుంది. ఇక్కడి ఇబ్బందులు, సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు చేయించాల్సి ఉంది. ఈ దిశగా అటు నీటిపారుదలశాఖ అధికారులు, ఇటు రైతులు ప్రయత్నం చేయకుంటే వర్షాకాలంలో సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది.