Share News

వీధి వ్యాపారుల కోసమా... రాజకీయ మైలేజీ కోసమా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:15 AM

చిరు వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ పేరుతో తిరుపతిలో బుధవారం వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం శ్రీవారి భక్తుల పాలిట ఇబ్బందిగా పరిణమించింది... అలిపిరి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండానే ఆందోళనకు దిగిన భూమన అభినయ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

వీధి వ్యాపారుల కోసమా... రాజకీయ మైలేజీ కోసమా?
పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం

పునరావాసం పేరుతో వైసీపీ ఆందోళన

పాల్గొన్నవారిలో పదిమంది కూడా లేని వ్యాపారులు

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 3(ఆంధ్రజ్యోతి):చిరు వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ పేరుతో తిరుపతిలో బుధవారం వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం శ్రీవారి భక్తుల పాలిట ఇబ్బందిగా పరిణమించింది... అలిపిరి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండానే ఆందోళనకు దిగిన భూమన అభినయ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమలులో ఉండగా నిబంధనలను ఉల్లంఘించి నిరసన చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు 25 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడించారు. అలిపిరి వంటి సున్నిత ప్రాంతంలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. వైసీపీ ముఖ్య నాయకులకు మంగళవారం రాత్రి వాట్సాప్‌ ద్వారా నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ బుధవారం ఉదయం అభినయ్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అలిపిరి వద్దకు చేరుకుని ఆందోళనకు ప్రయత్నించారు.41 మంది చిరు వ్యాపారుల పునరావాసం కోసం ఉద్యమం చేస్తున్నామని వైసీపీ ప్రకటించినప్పటికీ, కార్యక్రమానికి హాజరైన వారిలో పదిమంది వ్యాపారులు కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.దాదాపు 200 మంది పార్టీ శ్రేణులు పాల్గొని అరెస్టులు, కేసుల వరకు వెళ్లినా, జీవనోపాధి కోల్పోయినట్లు చెబుతున్న వ్యాపారులు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉండడం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. చిరు వ్యాపారుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ... చిరు వ్యాపారుల హక్కులు, స్ట్రీట్‌ వెండర్స్‌ చట్టం-2014, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(జి) అంశాలను తమ ప్రచారంలో వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు. చట్టాలున్నా పేద వ్యాపారులకు పాలకులు న్యాయం చేయడంలేదని ఆవేదన చెందారు. కాని... అదే చట్టాలను తోసిరాజని వైసీపీ నాయకులు అలిపిరి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.చట్టం, ప్రజల హక్కుల పేరుతో నిర్వహించిన కార్యక్రమమే చివరకు చట్ట ఉల్లంఘనతో కేసులకు దారితీయడం చర్చనీయాంశమైంది.

వీధి వ్యాపారులకు మద్దతుగా వైసీపీ నిరసన

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అలిపిరి సర్కిల్‌ నుంచి జూపార్కు రోడ్డులోని వీధివ్యాపారులకు న్యాయం చేయాలంటూ బుధవారం వైసీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 9గంటలకు తోపుడుబండ్లను తొలగించిన ప్రదేశంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదన్నారు. దీంతో వైసీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అభినయ్‌, కొంతమంది పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా అలిపిరి రోడ్డులోకి వచ్చారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోరాచారి ఆధ్వర్యంలో పోలీసులు అలిపిరి లింక్‌ బస్టాండు వద్ద వారిని అడ్డుకున్నారు.ఓ తోపుడు బండిని తోసుకుంటూ వెళ్లేందుకు అభినయ్‌, వైసీపీ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై కూర్చొని వీధి వ్యాపారులకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు అభినయ్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని మిగిలినవారిని అక్కడి నుంచి పంపించేశారు.టౌన్‌బ్యాంకు చైర్మన్‌ కేతం జయచంద్రారెడ్డి, వైసీపీ నగరాధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వాసుదేవయాదవ్‌, నల్లాని బాబు, సురేష్‌, చంద్రశేఖర్‌, దినే్‌షరాయల్‌, అరుణ్‌యాదవ్‌, అజయ్‌కుమార్‌, అనిల్‌రెడ్డి, విజయలక్ష్మి, గీతాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 01:15 AM