చేపల మార్కెట్‌లోనూ చండాలమేనా..?
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:14 AM
తిరుపతిలో మటన్ మాఫియా వ్యవహారం మరువక ముందే లీలామహల్ సర్కిల్ వద్ద ఉన్న చేపల మార్కెట్‌లోనూ అదే వాతావరణం వెలుగుచూసింది. మున్సిపల్ సిబ్బంది గురువారం చేపల మార్కెట్‌లో తనిఖీలు చేశారు. రెండు దుకాణాల్లో కుళ్లిపోయిన రొయ్యలు, పురుగులు పట్టిన చేపలు బయటపడ్డాయి. అలాగే అక్కడున్న ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఫంగస్ ఆనవాళ్లనూ గుర్తించారు.
- తనిఖీల్లో బయటపడ్డ కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు
తిరుపతి సెంట్రల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో మటన్ మాఫియా వ్యవహారం మరువక ముందే లీలామహల్ సర్కిల్ వద్ద ఉన్న చేపల మార్కెట్‌లోనూ అదే వాతావరణం వెలుగుచూసింది. మున్సిపల్ సిబ్బంది గురువారం చేపల మార్కెట్‌లో తనిఖీలు చేశారు. రెండు దుకాణాల్లో కుళ్లిపోయిన రొయ్యలు, పురుగులు పట్టిన చేపలు బయటపడ్డాయి. అలాగే అక్కడున్న ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఫంగస్ ఆనవాళ్లనూ గుర్తించారు.
తరచూ తనిఖీలు ఎక్కడ?
ఆహార భద్రత, మత్స్య శాఖ, మున్సిపల్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. కలుషితమైన చేపలు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు.ఇకనైనా కలుషిత ఆహార దందాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.
రెండు దుకాణాల సీజ్
చేపల మార్కెట్‌లో 22 దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ కుళ్లిన చేపలు, రొయ్యలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీ చేశారు. 9, 10 దుకాణాల్లో కుళ్లిన రొయ్యలు, కుళ్లిపోయి పురుగులు పట్టిన చేపలను గుర్తించారు. వీటిని డంపింగ్ యార్డుకు తరలించి.. రెండు దుకాణాలను సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్సులు రద్దు చేశామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.