అధికారుల తప్పిదంతోనే అక్రమాలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:01 AM
నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో అక్రమాలకు ఆస్కారం అధికారుల తప్పిదమేనని స్పష్టమవుతోంది.
అప్పుడే అప్రమత్తమై ఉంటే రూ.2కోట్లు సేఫ్
కేను ఫైల్ చేయకుండా పోలీసులు సహకరిస్తున్నారా?
మదనపల్లె, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో అక్రమాలకు ఆస్కారం అధికారుల తప్పిదమేనని స్పష్టమవుతోంది. రుణాల మంజూరు నుంచి పర్యవేక్షణ వరకూ అడుగడుగునా నిర్లక్షం ప్రదర్శించారన్న విమర్శలున్నాయి. సాధారణ తనిఖీల్లో నకిలీ బంగారం వ్యవహారం బయటపడినా, బంగారం బ్యాగుల్లో మిస్‌మ్యాచ్(వస్తువుల సంఖ్యలో తేడాలు) ఉన్నాయని గుర్తించినా వెంటనే చర్యలు చేపట్టలేదు. వాటిని సీజ్ చేయకుండా ఖాతాదారులకు వెనక్కి ఇచ్చేయడం, ఇంత జరిగినా నిందితుల నుంచి లాకర్ తాళాలను స్వాధీనం చేసుకోకపోవడం, వెంటనే అప్రమత్తమై పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి కేసు నమోదు చేయించడంలో నిర్లక్ష్యం వెరసి రూ.2 కోట్లు స్వాహాకు కారణమయ్యారనే చర్చ అటు డీసీసీబీ, ఇటు సహకారశాఖలో హాట్‌టాఫిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే..!
సాధారణ తనిఖీల్లో భాగంగా గతేడాది నవంబర్ 26న సెంట్రల్ బ్యాంకు సిబ్బంది, మదనపల్లె డీసీసీబీ బ్రాంచీ అధికారులు సంయుక్తంగా నిమ్మనపల్లె సొసైటీలో మంజూరు చేసిన బంగారు రుణాలపై రీ-అప్రైజింగ్ చేశారు. ఇందులో బంగారంపై రుణం తీసుకున్న 111 ఖాతాలను పరిశీలించారు. వీటిలో పది ఖాతాలు నకిలీ బంగారు పెట్టి రుణం తీసుకున్నారని గుర్తించారు. మిగిలిన ఖాతాలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన తనిఖీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అంతే తర్వాత ఏం చేయాలనే అంశంపైనే దృష్టి పెట్టారు కానీ అక్కడ నకిలీ బంగారాన్ని సీజ్ చేయడం కానీ, మిగిలిన తేడా ఉన్న బంగారం బ్యాగులపై దృష్టి పెట్టలేదు. యథావిధిగా దొంగల చేతికి తాళాలు ఇచ్చేసినట్లు వ్యవహరించారు.
14 ఖాతాలపై రూ.53.81 లక్షల రుణం
సొసైటీలో మొత్తం నమోదైన బంగారు రుణాల తాకట్టు ఖాతాలలో రూ.53.81 లక్షల విలువ చేసే 14 ఖాతాలలోనే అసలైన బంగారం ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. అది కూడా నకిలీదా? లేక టచ్ తక్కువగా ఉన్న బంగారమా? అనే విషయాన్ని పక్కన పెడితే చివరకు ఆ 14 మంది మాత్రమే దొరికారు. తాము సొసైటీలో రుణం తీసుకున్నామని, తిరిగి అప్పు చెల్లించి బంగారం విడిపించుకున్నామని చెప్పారు. ఇక మిగిలిన మిగిలిన 87 ఖాతాలలో ఇప్పటి వరకూ 35 మంది చిరునామాలపై క్షేత్రస్థాయిలో విచారిస్తే, ముగ్గురు వ్యక్తులు ఆచూకీ దొరికింది. అయితే వారు కూడా మేము సొసైటీలో బంగారంపై రుణం తీసుకోలేదని తేల్చిచెప్పేశారు. అంటే మొత్తమ్మీద తీసుకుంటే 111 మందిలో పది మంది నకిలీ బంగారంపై రుణం తీసుకుని తర్వాత విడిపించుకోగా, మరో 14 మంది రుణం తీసుకున్నామని ఒప్పుకున్నారు. ఇక మిగిలిన వారంతా సీఈవో.. రికార్డుల్లో సృష్టించిన బినామీలేనని స్పష్టమవుతోంది.
అక్కడి వ్యవహారాలన్నీ విరుద్ధమే..
సొసైటీలో బంగారు రుణాల మంజూరులో ఆది నుంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. 2022లో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఏమాత్రమూ పాటించలేదని స్పష్టమవుతోంది. దీనికితోడు అటు డీసీసీబీ, ఇటు సహకారశాఖ అధికారుల పర్యవేక్షణ ఏమాత్రమూ లేకపోవడంతో సీఈవో ఇష్టానుసారం వ్యవహరిం చారని విచారణలో తేటతెల్లమైంది. సొసైటీ ఆపరేషన్ పరిధిలోని రైతులకు, అందులోనూ సొసైటీలోని సభ్యుడికి మాత్రమే బంగారంపై రుణం ఇవ్వాలి. అలాగే సొసైటీలో సేవింగ్ ఖాతా ప్రారంభించాలి. బంగారంపై ఇచ్చే రుణం కూడా సొసైటీ ఖాతాకు జమ చేయాలి. కానీ ఇవేమీ జరగలేదు. కీలకమైన అప్రైజర్ నియామకం నుంచి విధుల నిర్వహణ వరకూ నిబంధనలు పాటించలేదు.
తనిఖీలు కూడా తూతూమంత్రమే
సొసైటీ లావాదేవీలపై అటు సెంట్రల్ బ్యాంకు, డీసీసీబీ బ్రాంచ్, డివిజన్ స్థాయి సహకారశాఖ అధికారులు మూడునెలలకోసారి రీ-అప్రైజింగ్‌తోపాటు రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంది. అడపాదడపా ఇవి చేసినా లోతుగా చూడలేదని తెలుస్తోంది. లాకర్‌లోని బంగారం బ్యాగులను చూడటం వరకే పరిమితమయ్యారు. ఈ విషయాన్ని పక్కనపెడితే అక్కడ అక్రమాలు గుర్తించాకైనా నిందితుడిని అదుపులోకి తీసుకోవడమో లేక కేసు నమోదు చేయించే పనులు చేపట్టలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సంఘటన జరిగిన నెలన్నర అయినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలు తావిస్తోంది.