కలుషిత ఆహార ఘటనపై విచారణ పూర్తి
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:03 AM
స్విమ్స్ ఆవరణలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, పద్మావతి వైద్య కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు మంగళవారం కలుషిత ఆహారంతో అస్వస్థత పాలైన ఘటనపై హై పవర్ కమిటీ విచారణ పూర్తయింది. రెండు రోజుల పాటు ఆసుపత్రి, హాస్టళ్ళు, వంటశాల, నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించిన మంగళగిరి ఎయిమ్స్ అకడమిక్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
నేడు స్విమ్స్ డైరెక్టర్‌కు నివేదిక
తిరుపతి సెంట్రల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): స్విమ్స్ ఆవరణలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, పద్మావతి వైద్య కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు మంగళవారం కలుషిత ఆహారంతో అస్వస్థత పాలైన ఘటనపై హై పవర్ కమిటీ విచారణ పూర్తయింది. రెండు రోజుల పాటు ఆసుపత్రి, హాస్టళ్ళు, వంటశాల, నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించిన మంగళగిరి ఎయిమ్స్ అకడమిక్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు.ఘటన జరిగిన రోజున విద్యార్థులకు అందించిన ఆహార నమూనాలను, నీటి నమూనాలను పరీక్షల కోసం పంపారు.రుయా నుంచి నీటి నమూనాల నివేదిక శనివారం వస్తుందని ఆ తర్వాత స్విమ్స్ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు కమిటీ తెలిపింది. కూరల్లో వాడిన టమోటా, ఉర్లగడ్డలో ఫంగస్ చేరడం వాటిని సరిగా కడగక పోవడం వల్లే విద్యార్థులు అస్వస్థత పాలైనట్లు సమాచారం.విద్యార్థులు కమిటీ సభ్యులతో మాట్లాడినప్పుడు స్విమ్స్, ఆయుర్వేద కళాశాలల హాస్టళ్ళకు వెంటనే మెనూ మార్చాలని కోరినట్లు సమాచారం.ఉచిత క్యాంటీన్‌తో పాటు పెయిడ్ క్యాంటీన్ వుండాలని,విద్యార్థుల అభిరుచులకు తగినట్లు చపాతి, రోటీ, పూరి సరఫరా చేయాలని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం దాదాపు 1400 మంది విద్యార్థులకు కలిపి ఒకే కిచెన్ వుందని, అలా కాకుండా ప్రతి హాస్టల్ వద్ద మాడ్యులర్ కిచెన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.