Share News

తవణంపల్లె మాజీ తహసీల్దారుపై విచారణ

ABN , Publish Date - May 14 , 2026 | 12:12 AM

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో తహసీల్దారుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన టి.జి.మోహనవల్లి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాల గురించి సమగ్ర విచారణకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తవణంపల్లె మాజీ తహసీల్దారుపై విచారణ

మరో ఏడుగురు రెవెన్యూ ఉద్యోగులపైనా..

విచారణాధికారిగా చిత్తూరు డీఆర్వో నియామకం

కలికిరి, మే 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో తహసీల్దారుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన టి.జి.మోహనవల్లి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాల గురించి సమగ్ర విచారణకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు అదే కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దారు టి.బి.నరే్‌షకుమార్‌, అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సి.రమే్‌షకుమార్‌, ఏఎ్‌సవో బత్తిని గోవర్ధన్‌ యాదవ్‌, వీఆర్వోలు జి.సుబ్రమణ్యం, సీహెచ్‌. సురే్‌షకుమార్‌, ఎస్‌.కరుణాకరన్‌, ఎ.వెంకటమునిపైనా విచారణ జరపాలని ఆదేశించింది. 2021 జూన్‌ 1న ఏసీబీ అధికారులు తవణంపల్లె ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాసుపుస్తకాలను వీఆర్వోల వద్ద కనుగొన్నారు. పాసుపుస్తకాల పంపిణీని పర్యవేక్షించకుండా తహసీల్దారు మోహనవల్లి విఫలమయ్యారని ఏసీబీ ఆరోపించింది. అంతేగాక మీసేవ ద్వారా అందిన అర్జీలపై ఎలాంటి విచారణా చేపట్టకుండానే కారణాలు లేకుండా తిరస్కరించారనేది ఆమెపై మరో అభియోగం. కార్యాలయంలో రిజిస్టర్లను నిర్వహించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఏసీబీ గుర్తించింది. మొత్తం ఏడు రకాల అభియోగాలను ఏసీబీ నమోదు చేసింది. వీటన్నిటిపై 10 రోజుల్లో సమాధానం చెప్పుకోవాలని ఆదేశిస్తూ 2025 ఆగస్టు 6 నిందితులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వీరు పంపుకున్న సంజాయిషీలపై సంతృప్తి చెందని ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. విచారణాధికారిగా జిల్లా రెవెన్యూ అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు సహకరించడానికి తిరుపతి ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ టి.మల్లికార్జునను ప్రెజెంటింగ్‌ అధికారిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌.. ఇన్‌చార్జి రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 14 , 2026 | 12:12 AM