Share News

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:16 AM

రూ.పది లక్షల నగదు, మొబైల్‌ స్వాధీనం

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ధీరజ్‌

మదనపల్లె అర్బన్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల పేరుతో ఫోన్‌ కాల్స్‌తో బెదిరించి, సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని సోమవారం మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్‌ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. మదనపల్లె అమ్మినేని వీధికి చెందిన ఆవుల విజయలక్ష్మి(73) భర్త అడ్వకేట్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. వారి అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉన్న విషయాన్ని గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో విజయలక్ష్మికి ఫోన్‌ చేశారు. మీ ఆధార్‌ నెంబరు తమ వద్ద ఉందని, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారని, ఎలాంటి పన్నులూ కట్టడం లేదని, ఇలాగైతే వారి పాస్‌పోర్టులు, ఆధార్‌ కార్డులు సీజ్‌ చేస్తామని బెదిరించారు. వెంటనే డబ్బు కట్టాలని కోరారు. భయపడిన ఆమె రెండు విడతలుగా భర్త అకౌంట్‌ నుంచి రూ.80లక్షలు ఒకసారి, రూ.12లక్షలు ఒకసారి పంపింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్పకు చెందిన లింగబలిజ విరూపాక్ష(24)ను సోమవారం మదనపల్లె-అంగళ్లు రోడ్డులోని ఆర్‌కే టైల్స్‌ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌, సిమ్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని, వీరికి కాంబోడియా, కువైట్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ వెంకటాద్రి, వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి, సైబర్‌ క్రైమ్‌ సీఐ మహమ్మద్‌ అలీ, ఎస్‌ఐ రహీముల్లా పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 02:16 AM