Share News

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:49 AM

మూడు రాష్ట్రాల్లో బైక్‌లను చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి వెస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్టు
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీనివాసులు

24 వాహనాల స్వాధీనం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మూడు రాష్ట్రాల్లో బైక్‌లను చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి వెస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్‌చారి, అడ్మిన్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన బైక్‌ల చోరీకి సంబంఽధించిన కేసుల్లో డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలో సీఐ రామకృష్ణ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా గురించి సమాచారం తెలుసుకున్నారు. వారి కదలికలపై నిఘాపెట్టి ఆదివారం తిరుపతిలో నిందితులైన ఆరెద్దుల వినోద్‌కుమార్‌(32), చెర్లోపల్లి గోవిందరాజులు(34), గోవిందస్వామి మురళి (30)ను అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వారు చోరీ చేసిన రూ.25 లక్షల విలువైన 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌కుమార్‌పై 21, గోవిందరాజులుపై 14, మురళిపై 17 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. రికవరీ చేసిన 24 వాహనాల్లో 9 బైక్‌లను వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించారు. మిగిలిన 15 వాహనాల యజమానుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన వెస్ట్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు హేమాద్రి, సుబ్బారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ రాము, కానిస్టేబుళ్లు రవి, చరణ్‌, నాగార్జున, తిలక్‌, జ్ఞానేశ్వర్‌, గిరి, ఉమెన్‌ కానిస్టేబుల్‌ శాంతిని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు.

Updated Date - Oct 05 , 2026 | 12:49 AM