శ్రీసిటీలో అంతర్జాతీయ వర్శిటీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:40 AM
జిల్లాకు మరో అత్యున్నత స్థాయి విద్యా సంస్థ రాబోతోంది. శ్రీసిటీ యాజమాన్యం కింద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
-రూ. 250 కోట్లతో 60 ఎకరాల్లో ఏర్పాటు
-ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం
తిరుపతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో అత్యున్నత స్థాయి విద్యా సంస్థ రాబోతోంది. శ్రీసిటీ యాజమాన్యం కింద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంగణంలో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు శ్రీసిటీ యాజమాన్యం ఆసక్తి చూపుతోందంటూ ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదన చర్చకు వచ్చింది.ప్రభుత్వం అనుమతిస్తే రూ. 250 కోట్ల పెట్టుబడితో 60 ఎకరాలలో వర్శిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వుందని తెలిపింది. శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడవనున్న ఈ వర్శిటీ స్టార్ట్‌పలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లకు కేంద్రంగా పనిచేస్తూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఈ వర్శిటీ తన నాన్ మెడికల్ కోర్సుల్లో కనీసం 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద విద్యార్థులకు కేటాయించేందుకు అంగీకరించిందని కూడా సంబంధిత శాఖ వివరించింది. గ్రీన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఈ కొత్త ప్రైవేటు వర్శిటీ ఏర్పాటు కోసం ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016 షెడ్యూల్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఉన్నత విద్యా శాఖ ప్రతిపాదించింది. దీనిపై చర్చించిన మంత్రివర్గం ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016 చట్టం షెడ్యూల్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అంగీకరించింది. కాగా ఈ పరిణామంతో జిల్లాలో ఇప్పటికే వున్న పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల సరసన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ కూడా చేరనుంది. శ్రీసిటీలో ఇదివరకే 40 ఎకరాల్లో క్రియా యూనివర్శిటీ నడుస్తోంది. అలాగే మరో 80 ఎకరాల్లో ట్రిపుల్ ఐటీ కూడా వుంది. వీటితో పాటు చిన్మయ విద్యాలయ, అకార్డ్ స్కూల్ వంటి ప్రైవేటు పాఠశాలలు కూడా వున్న సంగతి తెలిసిందే.