కూటమి అభ్యర్థులకు ఇంటిపోరు
ABN , Publish Date - Oct 28 , 2026 | 02:03 AM
సస్పెన్షన్ హెచ్చరికలూ లెక్కచేయని రెబల్స్
తిరుపతి సిటీ - ఆంధ్రజ్యోతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుండగా ఎన్డీయే కూటమిలో రెబల్స్ బెడద కలకలం రేపుతోంది. డివిజన్లలో సీట్ల సర్దుబాటు అనంతరం కూటమి ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిన కొందరు ఆశావహులు, అసమ్మతి నేతలు స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం నాయకత్వానికి సవాల్‌గా మారింది. పొత్తు ధర్మాన్ని పాటించకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కూటమి నేతలు హెచ్చరించినా కొందరిలో మార్పు కనిపించడం లేదు.
ఆరు డివిజన్లలో రెబల్స్ పోరు
21వ డివిజన్‌నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి టీడీపీ నాయకుడు దొడ్డారెడ్డి రామకృష్ణా రెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తన సామాజిక వర్గం ఉన్న డివిజన్‌లో చాపకింద నీరులా బలాన్ని కూడగడుతున్నట్టు తెలుస్తోంది. 42వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గంజి సుధాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా అదే పార్టీకి చెందిన కంకణాల రజనీకాంత్ రెబల్‌గా నిలిచారు. అయితే పార్టీ అధిష్ఠానం బుజ్జగింపులతో కూటమి అభ్యర్థి గెలుపుకోసం చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. 26వ డివిజన్‌నుంచి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ బరిలో ఉండగా జనసేన నుంచి మాజీ కార్పొరేటర్ పొన్నాల చంద్ర, టీడీపీ నుంచి కోటేశ్వరరావు, బి.నరేంద్రబాబు ఎన్నికల రంగంలో ఉన్నారు. అధిష్ఠానం ఆదేశాలతో పొన్నాల చంద్ర విత్‌డ్రా చేసుకోగా నరేంద్ర బాబు మౌనంగా ఉన్నారు. కోటేశ్వరరావు మాత్రం తనను గెలిపించాలని ప్రచారం మొదలుపెట్టినట్టు తెలిసింది. 27వ డివిజన్ నుంచి జనసేన అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ సీకే రేవతి బరిలో ఉంటే టీడీపీ నాయకురాలు టి.రేవతి రెబల్‌గా ఉన్నారు. టీడీపీ ట్యాగ్‌లైన్ వాడుకుని ఓటర్లను ప్రలోభాలు పెట్టే స్థాయికి వచ్చినట్టు ఆరోపణలున్నాయి. 47వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు రాజేష్ ఆచారి, హరికృష్ణ, గుత్తా నాగరాజు రాయల్ ఇండిపెండెంట్లుగా ఉన్నారు. కూటమి నేతల బుజ్జగింపులతో రాజేష్ ఆచారి తనకోసం ప్రచారం చేయకుండా దూరం జరిగారు. హరికృష్ణ అసాధ్యమైన డిమాండ్లతో దోబూచులాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నాగరాజు రాయల్ మాత్రం బహిరంగంగానే తన గెలుపుకోసం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇక 60వ డివిజన్ నుంచి జనసేన నాయకురాలు ఆకేపాటి సుభాషిణి పోటీలో ఉంటే అదే పార్టీలో ఉన్న ఆదం సుధాకర్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
హెచ్చరికలు లెక్కచేయని తిరుగుబాటుదారులు!
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో నిలిచిన రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఊపేక్షించేది లేదని కూటమి పార్టీల అధ్యక్షులు హెచ్చరికలు జారీ చేశారు. కూటమిలోని ఏ పార్టీలోనూ చేర్చుకోమని తేల్చి చెప్పారు. అయినా పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులకు పోటీగా నిలబడిన రెబల్స్ ప్రచారంలో దూకుడు పెంచుతుండడం గమనార్హం. పోలింగ్‌కు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో రెబల్స్‌ను దారికి తెచ్చేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. రెబల్స్ వ్యవహారంలో కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయం అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపనుంది.