అంతర్ జిల్లా చోరీ ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:25 AM
ఇద్దరి అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు రూ.20లక్షల బంగారు, వెండి స్వాధీనం
మదనపల్లె క్రైం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసే అంతర్ జిల్లా ముఠా గుట్టును పెద్దమండ్యం పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.20లక్షల బంగారు, వెండి నగలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ ఎరుకులవారిపల్లెకు చెందిన ఇరగ అశోక్(30), రాయచోటి మండలం గొర్లముదివీటి పంచాయతీ గుట్టకింద హరిజనవాడకు చెందిన గువ్వ ఆనంద్బాబు (35), అనంతపురం పట్టణం జ్యోతిబసు కాలనీకి చెందిన కావడి శ్రీనివాసులు(34) పాత నేరస్తులు. గతంలో అశోక్ సెల్ఫోన్లు, టూవీలర్స్, ఆనంద్ ఎర్రచందనం, శ్రీనివాసులు ఇళ్లలో చోరీ కేసుల్లో పట్టుబడి తిరుపతికి జైలుకు వెళ్లారు. అక్కడ ఆ ముగ్గురికి పరిచయమైంది. బెయిల్పై వచ్చాక ముగ్గురూ కలసి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేయడం మొదలుపెట్టారు. ఐదునెలల్లో పెద్దమండ్యం, వీరబల్లి, చిన్నమండ్యం, వాల్మీకిపురం, ముదివేడు, మదనపల్లె తాలూకా, బి.కొత్తకోట పోలీ్సస్టేషన్ల పరిధిలో 9చోరీలు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా పెద్దమండ్యం పోలీసులు ఇటీవల అశోక్, ఆనంద్ను అదుపులోకి తీసుకోవడంతో నిందితుల గుట్టు రట్టయింది. బుధవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ.20 లక్షల విలువ చేసే 185 గ్రాముల బంగారు, 450 గ్రాముల వెండి, టూవీలర్ను స్వాధీనం చేసుకున్నారు. కావడి శ్రీనివాసులు పరారీలో ఉన్నాడు. కేసుల ఛేదనకు కృషి చేసిన మదనపల్లె, రాయచోటి డీఎస్పీలు ప్రసాద్, కృష్ణమోహన్, క్రైం సీఐ రాజారెడ్డి, పెద్దమండ్యం ఎస్ఐ హరిహరప్రసాద్, టెక్నికల్, క్రైం సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉలసయ్య, ఎస్ఐలు నరసింహుడు, రమేష్, రహీముల్లా పాల్గొన్నారు.