మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటీ
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:05 AM
త్వరలో కొలువుదీరనున్న మున్సిపల్ కౌన్సిళ్లలో వైస్ ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. గత ప్రభుత్వంలో అమలైన విధానానికి భిన్నంగా ఇపుడు మున్సిపాలిటీకి ఒకే వైస్ ఛైర్మన్ పదవి వుండడంతో పోటీ తీవ్రమైంది.
తిరుపతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): త్వరలో కొలువుదీరనున్న మున్సిపల్ కౌన్సిళ్లలో వైస్ ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. గత ప్రభుత్వంలో అమలైన విధానానికి భిన్నంగా ఇపుడు మున్సిపాలిటీకి ఒకే వైస్ ఛైర్మన్ పదవి వుండడంతో పోటీ తీవ్రమైంది. చాలావరకూ ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తుండగా ఒకటి రెండు చోట్ల రాజధాని స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.వెంకటగిరిలో బీజేపీ కౌన్సిలర్ మినహా నాలుగు మున్సిపాలిటీల్లో ఆశావహులంతా టీడీపీ కౌన్సిలర్లే కావడం విశేషం.
వెంకటగిరిలో 12మంది యత్నాలు
వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వయింది. టీడీపీ అభ్యర్థి దొంతు శారద ఛైర్‌పర్సన్‌గా గెలిచారు. దీంతో వైస్ ఛైర్మన్ పదవి ఓసీ, ఎస్సీ వర్గాలు ఆశిస్తున్నాయి.బలిజ సామాజికవర్గం నుంచీ జంపాల ప్రకాష్, బీరం దేవిశ్రీ, మంకు హేమలత, వెలమ సామాజికవర్గం నుంచీ పులికొల్లు రాజేశ్వరి, కమ్మ సామాజికవర్గం నుంచీ పర్వతాల మణి, మైనారిటీ వర్గం నుంచీ జుబేదా బేగం, బీసీలకు సంబంధించి పల్లిరెడ్డి సామాజికవర్గానికి చెందిన తాండవ కళావతి పేర్లు ప్రచారంలో వున్నాయి. మరోవైపు ఎస్సీ సామాజికవర్గం నుంచీ కొప్పరపు చెంగారావు, మల్లారం బాబు, అరవ లక్ష్మి, మోమిడి నరసింహులు కూడా రేసులో వున్నారు. ఈ ఆశావహులు 11 మందీ టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. బీజేపీ నుంచీ ఎస్సీ వర్గానికే చెందిన శివ సైతం వైస్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఆశావహుల జాబితాలో 12 మంది వున్నప్పటికీ ప్రధానంగా జంపాల ప్రకాష్‌కు అవకాశాలు ఎక్కువగా వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కుటుంబానికి సన్నిహితుడు కావడంతో అతడి పేరు అధిష్ఠానం పరిశీలనలో వుందని సమాచారం. ప్రకాష్ మున్సిపల్ ఎన్నికల సమయంలో జనసేన నుంచీ టీడీపీలో చేరారని, వచ్చీ రాగానే కౌన్సిలర్ టికెట్ ఇవ్వడానికి, ఇపుడు వైస్ ఛైర్మన్ పదవికి ప్రతిపాదించడానికి కారణం ఎమ్మెల్యేకి సన్నిహితుడు కావడం వల్లనేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సూళ్ళూరుపేట రేసులో ఐదుగురు
సూళ్ళూరుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వయింది. టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని ఎన్నికయ్యారు. దీంతో వైస్ ఛైర్మన్ పదవిని సామాజిక సమీకరణల్లో భాగంగా ఓసీ, బీసీ వర్గాలకు చెందిన పురుష కౌన్సిలర్లకు కేటాయించనున్నారు. ఈ పదవి కోసం అలవల శ్రీనివాసులు, మేడా సాయినారాయణ, బాలచంద్ర అలియాస్ ఏజీ కిషోర్, చీమలదిన్నె రమణయ్య, పోలూరు రాధాకృష్ణ తదితరులు ఆశిస్తున్నారు. సూళ్ళూరుపేట పంచాయతీగా కొనసాగినంతకాలం వైశ్యుల ప్రాబల్యం నడిచింది. మున్సిపాలిటీ అయ్యాక తగ్గింది. వైస్ ఛైర్మన్ పదవిని అలవల శ్రీనివాసులుకు కేటాయించడం ద్వారా తమ సామాజికవర్గానికి తిరిగి ప్రాధాన్యత కల్పించాలని వైశ్యులు కోరుతున్నారు.శ్రీనివాసులుకు అవకాశం దక్కనిపక్షంలో రజక వర్గానికి చెందిన సీనియర్ నేత రమణయ్యకు ఛాన్స్ దక్కవచ్చునని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సిఫారసుకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, కొండేపాటి గంగాప్రసాద్ దీనిపై అధిష్ఠానంతో చర్చించినట్టు సమాచారం.
నాయుడుపేట పదవి రఫీకి ఖరారైనట్టే
నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వయింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఛైర్‌పర్సన్‌గా గెలిచారు. వార్డుల్లో మాత్రం మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. దీంతో వైస్ ఛైర్మన్ పదవికి ప్రాముఖ్యత పెరిగింది. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన షాకీరా భర్త 786 రఫీ వైస్ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. 14వ వార్డు నుంచీ కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన టీడీపీలో కీలక నేత కావడంతో పాటు గతంలో వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేసిన అనుభవముంది.మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం మద్దతు కూడా రఫీకి వున్నట్టు సమాచారం. దీంతో వైస్ ఛైర్మన్ పదవి దాదాపుగా ఆయనకే ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పుత్తూరులో నలుగురు ఆశావహులు
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వయింది. ఛైర్మన్‌గా జనసేనకు చెందిన ఏలుమలై అలియాస్ అమ్ములు గెలిచారు. దీంతో వైస్ ఛైర్మన్ పదవిని ఓసీ, ఎస్సీ వర్గాల నుంచీ నలుగురు ఆశిస్తున్నారు.ఆశావహులంతా టీడీపీకి చెందినవారే. కమ్మ సామాజికవర్గం నుంచీ గాలి జీవరత్నం నాయుడు, బలిజ సామాజికవర్గం నుంచీ జ్యోతి శంకర్ అలియాస్ విక్కీ రాయల్, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ప్రతాప్ రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్సీల నుంచీ ఆనంగి ఆనంద్ పేరు కూడా ప్రచారంలో వుంది.వీరిలో జీవరత్నం నాయుడు రెండవసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గానూ వ్యవహరించారు. పార్టీలో సీనియర్ నేత. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కూడా. ఇక ప్రతాప్ రాజు విషయానికొస్తే ఆయన గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రముఖ శల్యవైద్య కుటుంబానికి చెందిన వారు. ఆనంగి ఆనంద్ కూడా గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ముగ్గురికీ రాజకీయ నేపధ్యం, పార్టీలో సీనియారిటీ వున్నందున అవకాశం కోసం అనుచరుల నుంచీ ఒత్తిడి వస్తోంది. ఇక జ్యోతిశంకర్ అలియాస్ విక్కీ రాయల్ కౌన్సిలర్‌గా తొలిసారి గెలిచారు. ఈ నలుగురిలో ఎమ్మెల్యే సిఫారసు ఎవరికి లభిస్తుందో, అంతిమంగా అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో తొందరలోనే తేలిపోనుంది.