జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 17 అనుసంధాన పనుల పూర్తి
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:35 AM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.
సూళ్లూరుపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. వచ్చే నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు రాకెట్‌ను శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్నారు.ఈ నేపఽథ్యంలో షార్‌లోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు శాస్త్రవేత్తలు పూర్తి చేసి రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు. ప్రయోగానికి సంబంధించి మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం ఈ నెల 1న షార్‌లో నిర్వహించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం జరిగే లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్) సమావేశంలో ప్రయోగ సమయం, తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించనుంది.50.9 మీటర్ల పొడవున్న రాకెట్ ప్రయోగ సమయంలో 420.7 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయల్దేరనుంది.