దామినేడులో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:33 AM
తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. తిరుపతి రూరల్ మండలం దామినేడులో పలు వ్యాపార, వినోద, విహార, ఆతిధ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి
ఏర్పాటు కానున్న పలు వినోద, విహార, ఆతిఽథ్య కేంద్రాలు
తిరుపతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. తిరుపతి రూరల్ మండలం దామినేడులో పలు వ్యాపార, వినోద, విహార, ఆతిధ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రూ. 1226.32 కోట్ల అంచనా వ్యయంతో ఈ పర్యాటక ప్రాజెక్టు చేపట్టేందుకు దివ్యశ్రీ హోల్డింగ్స్ , సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ముందుకొచ్చాయి. కన్సార్టియం ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చేసిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అందులో భాగంగా దామినేడులో 21.10 ఎకరాల భూమిని దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన లేదా ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన కేటాయించేందుకు అంగీకరించింది. 15 ఏళ్ళ పాటు ఎస్జీఎస్టీని వందశాతం రీ ఎంబర్స్ చేసేందుకు అంగీకారం తెలిపింది. ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్‌లో రూ. 40 కోట్లకు మించకుండా 10 శాతం ఐదు సమాన వాయిదాల్లో కన్సార్టియానికి చెల్లించేందుకు అంగీకరించింది. భూమి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీలకు వందశాతం రాయితీ ప్రకటించింది. ఐదేళ్ళ కాలానికి విద్యుత్ ఛార్జీలను పారిశ్రామిక కేటగిరీ కింద నిర్ణయించేందుకు అంగీకారం తెలిపింది. అలాగే ఐదేళ్ళ కాలానికి ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీ ఎంబర్స్ చేసేందుకు కూడా సమ్మతించింది. వీటితో పాటు మరిన్ని రాయితీలను ప్రకటించింది.అయితే కన్సార్టియం డీపీఆర్‌కు అనుగుణంగా వీటిలో మార్పులు జరిగే అవకాశం వుంటుంది.
మైస్ డెస్టినేషన్‌గా తిరుపతి
తిరుపతిని ఇంటర్నేషనల్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో వున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా తిరుపతిలో అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇపుడు దివ్యశ్రీ కన్సార్టియం ఓ భారీ ప్రాజెక్టుతో ముందుకు వచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించింది. ఇంతకీ మైస్ మీటింగ్స్, ఇన్‌సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) డెస్టినేషన్ అంటే వ్యాపార సంస్థల సమావేశాలు, ఉద్యోగులకు ప్రోత్సాహక ట్రిప్పులు, సమ్మేళనాలు, ప్రదర్వనలు వంటివి నిర్వహించేందుకు అనువైన, సదుపాయాలున్న గమ్యస్థానం. ఈ ప్రాజెక్టు కింద దామినేడులో కేటాయించే 21 ఎకరాలకు గానూ ఏడు ఎకరాల్లో 5 వేల మందికి సరిపడా సామరఽ్ధ్యంతో కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం కానుంది. అలాగే మరో ఏడు ఎకరాల్లో 300 గదులతో కూడిన వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందులో స్పా, యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, నేచర్ థెరపీ, హెల్త్ ప్రోగ్రామ్స్ వంటివి అందుబాటులో వుంటాయి. అక్కడే ఏడాదిలో కొంతకాలం పాటు బుక్ చేసుకునేలా టైమ్ షేరింగ్ ప్రాతిపదికన 250 గదులతో కూడిన రిసార్టు కూడా ఏర్పాటు కానుంది. హాస్పిటాలిటీ జోన్ కింద నాలుగు ఎకరాల్లో 200 గదులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్, 150 గదులతో కూడిన త్రీ స్టార్ హోటల్ నిర్మాణం కానున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ కింద రెండు ఎకరాల్లో మల్టీప్లెక్స్ రానుంది. కల్చరల్ జోన్ కింద మరో రెండు ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు కానుంది.ఈ ప్రాజెక్టు ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. దీనివల్ల తిరుపతి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారే అవకాశం కలగనుంది.