గాలికొదిలేసిన లైన్లపై ఆరా
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:28 AM
మదనపల్లె శివారు ప్రాంతాల్లో నిరుపయోగంగా వదిలేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కండక్టర్ తీసేసిన లైన్లపై ఆ శాఖ అధికారులు ఆరా తీశారు. ‘విలువైన సామగ్రిని గాలికొదిలేశారు’ అనే శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ గంగాధర్, ఏడీఈ హరికుమార్, ఏఈ కుమార్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మదనపల్లె, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె శివారు ప్రాంతాల్లో నిరుపయోగంగా వదిలేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కండక్టర్ తీసేసిన లైన్లపై ఆ శాఖ అధికారులు ఆరా తీశారు. ‘విలువైన సామగ్రిని గాలికొదిలేశారు’ అనే శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ గంగాధర్, ఏడీఈ హరికుమార్, ఏఈ కుమార్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాయమైన కండక్టర్, లైన్ల పరిస్థితిపై ఆరా తీశారు. తుప్పుపట్టిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ దుస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డిబావి, ఎలుకపల్లెకుంట ఏరియాకు.. పట్టణంలోని శేష్‌మహల్ ఏరియా నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. తర్వాత ఊరికిపైభాగంలో మరో లైన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుటికే ఉన్న 11 కేవీ లైన్‌ను గాలికొదిలేశారు. విలువైన సామగ్రిని ఇంటి, బయట దొంగలు సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, తాళ్లసుబ్బన్నకాలనీలోని ఎక్స్‌టెన్షన్ ఏరియాకు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. అలాగే తుప్పుపట్టిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. మరమ్మతులు చేయించడం, లేదా మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాదినికొండ ఫారెస్టు ఏరియాలో కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టాలని, కండక్టర్‌ను లాగి విద్యుత్ సరఫరా చేయాలని ఈఈ, సిబ్బందికి సూచించారు. ఎగువ కురవంకలో కండక్టర్ మాయంపైనా చర్చించారు. బాధ్యులెవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక్కడా లైన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించారు. మరోవైపు పట్టణానికి నాలుగువైపులా ఉన్న క్యూబికల్ లైన్‌ను కూడా పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అలాగే ఉంచడమా? తొలగించాలా? అన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఖాళీగా ఉన్న, నిరుపయోగంగా వదిలేసిన లైన్లు, విలువైన విద్యుత్తు సామగ్రిని తొలగించాలంటే పెద్ద తతంగమే ఉంది. ఎస్టిమేట్ వేసి సీఎండీ స్థాయిలో అనుమతి తీసుకోవాలి. ఆ స్థాయిలో అనుమతి వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా చెబుతున్నారు. అదే కొత్తలైన్ ఏర్పాటు చేయాలంటే, పని విలువను బట్టి ఈఈ, ఎస్‌ఈ స్థాయిలో అనుమతి వస్తుంది. అందువల్ల లైన్‌ను పునరుద్ధరించడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరితోపాటు విద్యుత్ శాఖ విజిలెన్స్ కూడా లైన్ల మాయం, దుస్థితిపై ఆరా తీసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.