మంగంపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:15 AM
పంచాయతీ నిధులు అడ్డుగోలుగా ఖర్చుపెట్టినట్లు స్థానికుడు గల్లా శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో తిరుపతి డీఎల్పీవో సురేష్ నాయుడు ఏప్రిల్‌లో మంగంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత రికార్డులను సీజ్ చేసి జిల్లా కార్యాలయానికి తరలించారు.
ఓబులవారిపల్లె, జూన్ 19(ఆంధ్రజ్యోతి): మంగంపేట పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల మాటున జరిగిన అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని పంచాయతీరాజ్ జాయింట్ డైరెక్టర్ కేవీ సాంబశివారెడ్డి, చీఫ్ ఇంజనీరు విజయ్‌కుమారి పేర్కొన్నారు. పంచాయతీ నిధులు అడ్డుగోలుగా ఖర్చుపెట్టినట్లు స్థానికుడు గల్లా శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో తిరుపతి డీఎల్పీవో సురేష్ నాయుడు ఏప్రిల్‌లో మంగంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత రికార్డులను సీజ్ చేసి జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు విజయవాడ నుంచి వచ్చిన స్టేట్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీరు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ తదితరులు శుక్రవారం ప్రాథమిక విచారణ చేపట్టారు. తిరుపతి, కడప జిల్లాల పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఆధర్యంలో రెండు బృందాలను నియమించారు. వీరు సంబంధిత డీఈల పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీరు విజయకుమారి, డీఈ వెలుగొండయ్య, డీఈఈ బీఎస్‌ఆర్ ప్రసాద్, డీఎల్పీవో సురేష్‌నాయుడు, ఏఈఈ శ్రీనివాసులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.