Share News

పరిశ్రమల కుప్పం

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:52 AM

ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు. దట్టమైన అడవులు, కొండలు కోనల నడుమ ఒదిగినట్లు ఉండే కుప్పం.. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని.. ఇక్కడినుంచి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

పరిశ్రమల కుప్పం

ఉద్యోగ, ఉపాధి స్వర్గంగా మలిచిన సీఎం చంద్రబాబు

యువతలో జోష్‌

ఇక కుప్పం మారుమూల ఒదిగివుండే వెనుకబడిన ప్రాంతం కాదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పొరుగు రాష్ట్రాలకు వలసలెళ్లే యువత నిట్టూర్పులు ఇక వినబడవు. - సీఎం చంద్రబాబు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడమే దీనికి కారణం. అందుకే కుప్పం యువత రాబోయే స్వర్ణ యుగాన్ని తలచుకుని మురుస్తోంది. ఉద్యోగాల నియామక పత్రాలను చేత పట్టుకుని చంద్రన్నకు జేజేలు పలుకుతోంది.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు. దట్టమైన అడవులు, కొండలు కోనల నడుమ ఒదిగినట్లు ఉండే కుప్పం.. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని.. ఇక్కడినుంచి విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ వ్యవసాయం, రోడ్లు, భవనాలు వంటి అభివృద్ధి పనులకే పరిమితమయ్యాయి. నిరుద్యోగ యువత ఉపాధికోసం పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లక తప్పలేదు. ఇవి చంద్రబాబుకు ఒక మచ్చగా కొనసాగాయి ఇంతకాలం. గతంలో చేసిన అభివృద్ధి గురించి నేటి యువతకు వివరించాలని, బాగా వెనుకబడిన కుప్పం ప్రాంతం టీడీపీ ప్రభుత్వంవల్ల, తన వల్లనే ఇప్పటి అభివృద్ధికి చేరుకుందన్న నిజం వారికి చెప్పాలని ఇంతకాలం స్థానిక పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచిస్తూ వచ్చారు. అయితే మూడు దశాబ్దాల కిందట కుప్పం ఎలా ఉంది? ఇప్పుడు ఎంతగా మారిందన్న దానితో యువతకు ప్రమేయం లేకుండా పోయింది. పొద్దు పొడవగానే టిఫిన్‌ బాక్సులు చేతపట్టుకుని బెంగళూరు వెళ్లి, అక్కడ కష్టంం చేసుకుని రాత్రి బాగా పొద్దుపోయాక ఇళ్లకు చేరుకునే వారికి ఆ కష్టం తప్ప మరేదీ కనబడలేదు. దీనిపై వారిలో ఎంతో కొంత అసంతృప్తి ఉండేది.

ఇప్పుడు పరిశ్రమల వంతు

కుప్పం నియోజకవర్గాన్ని ఒక పద్ధతి ప్రకారం సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఇటీవల దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రూ.9322 కోట్లతో 27 పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో యువతలో జోష్‌ నింపింది. గుడుపల్లె మండలం పొగురుపల్లె ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల్లోని ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఆయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే మూడునాలుగు లాంఛనంగా ప్రారంభమైనా, సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమల్లో ఫౌలీ్ట్ర, డెయిరీ, ఎలక్ట్రికల్‌, బ్యాటరీ, గ్రీన్‌ ఎనర్జీ, విమాన తయారీ పరికరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫుట్‌వేర్‌, గ్రానైట్‌ శిల్పకళ వంటివి ఉన్నాయి. అలాగే, ఇండస్ట్రియల్‌ హబ్‌లోనే ఏర్పాటు చేసిన ఎంఎ్‌సఎంఈ పార్కులో 600కు పైగా ఇళ్ల ప్లాట్లను కేటాయిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలకోసం ఇప్పటికే నియోజకవర్గ యువతలో వందల మందికి నియామకపత్రాలు అందాయి. ఇంకా వేల మందికి సమీప భవిష్యత్తులో ఉద్యోగాలు రానున్నాయి. పొగురుపల్లె పారిశ్రామికవాడలోనే కాదు, మొత్తం కుప్పం నియోజకవర్గంలో పండుగ వాతావరణం ఏర్పడింది. వెల్లువెత్తబోయే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యువతలో సరికొత్త ఆశలు ఊసులెత్తాయి.

Updated Date - Jul 04 , 2026 | 12:52 AM