మన బిడ్డల భవిష్యత్తుకోసమే పరిశ్రమలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:08 AM
‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.
కుప్పం/గుడుపల్లె, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. తన రెండో రోజు పర్యటనలో బుధవారం ఆమె కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. విద్యార్థులకు సందేశమిచ్చారు. గుడుపల్లె మండలం కోటమాకనపల్లెలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారి సాదకబాధకాల్లో పాలుపంచుకున్నారు. ఆయా సందర్భాల్లో భువనేశ్వరి మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గానికి ఇప్పటికే రూ.7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలను చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. పరిశ్రమలు కనుక వస్తే, స్థానిక యువతకు పెద్దయెత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రగతికి అడ్డుపడకుండా పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములిచ్చి సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో సోలార్ ఎనర్జీ వినియోగం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. మరోవైపు ప్రగతి, సంక్షేమంతోపాటు, ఆరోగ్యంపైనా చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. కుప్పంలో సంజీవని హెల్త్ క్లినిక్స్ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నదన్నారు. ‘నేనేం చేయగలనో అదే హామీని ప్రజలకు ఇస్తాన’ని చంద్రబాబు ఎప్పుడూ తనతో అంటుంటారని, అందువల్ల ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరతారని ఆయన తరఫున భరోసా ఇచ్చారు. ‘ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే గత అయిదేళ్లలో ఏం జరిగిందో మనం చూశాం. ఎంత విధ్వంసం జరిగిందో గమనించాం. మళ్లీ అటువంటి పొరపాటు చేయకండి. మంచి చేసే నాయకుడెవరో ఇప్పటికే తెలిసింది కాబట్టి, వారికే ఈసారి కూడా ఓటేసి గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. మహిళలు సర్వశక్తిమంతులని, వారిలో నిగూఢమైన శక్తిని వెలికితీస్తే పురుషులకు మించిన విజయాలు సాధించగలరన్నారు. అందుకు తననే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘గృహిణిగా ఉన్న నేను, హెరిటేజ్ బాధ్యతలను సవాల్‌గా తీసుకున్నాను. జీవితంలో సవాళ్లు వస్తుంటాయి. ఎదుర్కొని నిలబడాలి. విజయంవైపు అదే మార్గం పడుతుంది’ అని మహిళల్లో భువనేశ్వరి స్ఫూర్తి నింపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్‌బాబు, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారం తదితరులు పాల్గొన్నారు.