తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , Publish Date - May 21 , 2026 | 01:57 AM
రుసగా విద్యార్థుల పరీక్షల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.
తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): వరుసగా విద్యార్థుల పరీక్షల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమల కొండపై వేసవి భక్తుల రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాగా, రద్దీ పెరుగుతూనే ఉండటంతో సర్వదర్శన క్యూలైన్‌ను మధ్యాహ్నం ఒంటి గంటకు తాత్కాలికంగా టీటీడీ అధికారులు మూసివేశారు. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు తెరిచి భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించారు.
భారీగా తలనీలాల మొక్కులు
సోమ, మంగళవారాల్లో 86,341 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సాధారణంలో రోజూ సగటున 25 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారికి తలనీలాలు ఇస్తుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో 1.12 లక్షల మంది తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే. భక్తులు త్వరగా తలనీలాలు సమర్పించడానికి టీటీడీ ఒక ప్రధాన కల్యాణకట్టతోపాటు 11 ఉప కల్యాణకట్టల్లో 1,200 మంది క్షురకులను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ రెండ్రోజుల్లో 1.64 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.8.15 కోట్ల హుండీ ఆదాయం లభించింది.