Share News

రెండు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:29 AM

నాయుడుపేట సెజ్‌లో రెండు పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది.

రెండు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

తిరుపతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేట సెజ్‌లో రెండు పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది.వోల్ట్‌సన్‌ ల్యాబ్స్‌ సంస్థ రూ. 1743 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటు చేసి 415 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని గతేడాది ప్రతిపాదించింది. దీంతో గతేడాది నవంబరులో ప్రభుత్వం నాయుడుపేట సెజ్‌లో ఎకరా రూ. 60 లక్షల ధరతో మొత్తం 37 ఎకరాల భూమిని కేటాయించింది.తర్వాత ఆ భూమికి ఆనుకుని అదనంగా మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే పెట్టుబడి అంచనాను రూ. 1743 కోట్ల నుంచీ రూ. 1578 కోట్లకు సవరించింది. సవరించిన పెట్టుబడికి అనుగుణంగా ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని కోరింది. పరిశీలించిన ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన భూమి పక్కనే అదనంగా 4.8 ఎకరాలను కేటాయించింది. ధర కూడా మునుపు నిర్ణయించిన ప్రకారమే ఎకరా రూ. 60 లక్షల చొప్పున ఖరారు చేసింది. దీనితో పాటు అవసరమైన ప్రోత్సాహకాలను సైతం మంజూరు చేసింది. అలాగే రెనాటస్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ నాయుడుపేట సెజ్‌లో 24.67 ఎకరాల భూమి కేటాయించినట్టయితే రెండు దశల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. మొదటి దశలో రూ. 224 కోట్ల పెట్టుబడితో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డ్స్‌ తయారీ యూనిట్‌, ర్యాపిడ్‌ వాల్‌ ప్యానెల్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పుతామని, తద్వారా 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. రెండవ దశలో రూ. 127 కోట్ల పెట్టుబడితో ఏఏసీ ప్యానెల్‌ బ్లాక్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని, దానివల్ల 120 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అవసరమైన రాయితీలు మంజూరు చేసింది. కాగా ఈ యూనిట్ల ఏర్పాటు కోసం నాయుడుపేట సెజ్‌లో 24.67 ఎకరాల భూమి కేటాయించనుంది. కాగా శ్రీసిటీలో రూ. 213.90 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు డివైజ్‌ ఫార్మా టెక్‌ సంస్థ ముందుకొచ్చింది. తద్వారా 114 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ పరిశ్రమకు కూడా ప్రభుత్వం అమల్లో వున్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా రాయితీలు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

---------------------------------

Updated Date - Jun 27 , 2026 | 01:29 AM