అన్ని రంగాల్లో.. సమపాళ్లలో..!
ABN , Publish Date - May 08 , 2026 | 02:08 AM
జిల్లాను అన్ని రంగాల్లో.. సమపాళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, స్కిల్ డెవల్‌పమెంట్, డిజిటల్ హెల్త్, సౌర విద్యుత్తు, విద్యా రంగాల్లో భారీ లక్ష్యాలతో ముందుకెళుతోంది. 2026-27 లక్ష్యాల మేరకు జిల్లాలో రూ.వేల కోట్ల పెట్టబడులు, వేలాది ఉద్యోగాలు, ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గురువారం తొలి రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సుమిత్‌కుమార్.. జిల్లాకు సంబంధించిన ఆయా అంశాలను నివేదించారు.
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు
- తొలిరోజు కలెక్టర్ల సదస్సులో చర్చనీయాంశాలు
చిత్తూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాను అన్ని రంగాల్లో.. సమపాళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, స్కిల్ డెవల్‌పమెంట్, డిజిటల్ హెల్త్, సౌర విద్యుత్తు, విద్యా రంగాల్లో భారీ లక్ష్యాలతో ముందుకెళుతోంది. 2026-27 లక్ష్యాల మేరకు జిల్లాలో రూ.వేల కోట్ల పెట్టబడులు, వేలాది ఉద్యోగాలు, ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గురువారం తొలి రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సుమిత్‌కుమార్.. జిల్లాకు సంబంధించిన ఆయా అంశాలను నివేదించారు.
రూ.56,590 కోట్ల ఆర్థిక లక్ష్యం
2025-26లో రూ.49,290 కోట్ల స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ) నమోదు చేసి రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 16.09 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2026-27లో దీన్ని రూ.56,590 కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు, సేవా రంగం, వ్యవసాయ అనుబంధం రంగాల్లో జిల్లా ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది.
తలసరి ఆదాయం లక్ష్యం రూ.2.88 లక్షలు
జిల్లాలో ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.2.51 లక్షలుగా ఉండగా, వచ్చే ఏడాది రూ.2.88 లక్షలకు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే 15.86 శాతం వృద్ధి సాధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
24 వేల మందికి ఉద్యోగాలే లక్ష్యం
2024 జూన్ నుంచి 2026 మార్చి వరకు జిల్లాలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ల ద్వారా 54,667 మందికి ఉద్యోగాలు కల్పించారు. 50కిపైగా పరిశ్రమలు పాల్గొనగా, 24 సార్లు జాబ్ ఫెయిర్లను నిర్వహించారు. 2026-27లో ప్రతి నియోజకవర్గంలోనూ త్రైమాసికానికో జాబ్ ఫెయిర్ నిర్వహించి మరో 24 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకుంది.
ఫ జిల్లా స్కిల్ డెవల్‌పమెంట్ ప్లాన్ ద్వారా 12 కీలక రంగాల్లో 4,330 ఉద్యోగ అవకాశాలను గుర్తించారు. వెంటనే 544 మందికి, కొంతకాలం తర్వాత రూ.805 మందికి, దీర్ఘకాలంలో 1241 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యచరణ రూపొందించారు.
ఫ పీఎం సేతు పథకం కింద జిల్లాకు రూ.360 కోట్లను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.180 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.119 కోట్లు, పరిశ్రమలు రూ.61 కోట్ల మేర భాగస్వామ్యం చేయనున్నాయి. దీంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పరిశ్రమల అనుసంధానం, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
విస్తృతంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన డిజిటల్ నెర్వ్ సెంటర్.. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ఫోన్‌కాల్స్, టెలీమెడిసిన్, ఫాలోఅప్ సేవలతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు ఇంటి వద్దకే చేరుతున్నాయి. ఇప్పటివరకు 1,83,060 ఓపీ రిజిస్ర్టేషన్లు నమోదయ్యాయి. ఇందులో కుప్పం నియోజకవర్గంలోనే 1,38,413 సేవలు అందించగా, పుంగనూరు ప్రాంతంలో 9,866, పలమనేరులో 9,218 సేవలు అందించారు.
పీఎం సూర్యఘర్‌కు 26,816 మంది దరఖాస్తు
పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 26,816 దరఖాస్తులు అందాయి. 3498 కిలోవాట్ల సామర్థ్యంతో 1529 ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయి. యూఎల్‌ఏ మోడల్ కింద జిల్లాలో 21530 మందిని గుర్తించి, 3380 కిలోవాట్ల సామర్థ్యంతో 1690 సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేశారు.
ఫ 78 ప్రభుత్వ విద్యాసంస్థల్లో సోలార్
నెట్ జీరో క్యాంపస్ లక్ష్యంతో జిల్లాలో 92 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లపై సర్వే చేయగా, 78 విద్యాసంస్థలు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. వీటి ఏర్పాటుతో ఏటా రూ.79.93 లక్షల విద్యుత్తు ఆదా అవుతుందని అంచనా.
ఎన్‌హెచ్‌లకు 36.73 హెక్టార్లు అవసరం
జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం 66 కిలోమీటర్ల మేర రహదారి క్లియరెన్సు కోసం రూ.36.73 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది.
పాఠశాలల్లో నమోదు పెంపే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26కు గానూ 1,20,946 మంది విద్యార్థులు నమోదుకాగా, 2026-27లో ఈ సంఖ్యను 1,33,041కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల చేరికపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సగటు హాజరు శాతం 86.01 కాగా, ఉపాధ్యాయుల హాజరుశాతం 91.19గా ఉంది. తక్కువ హాజరున్న పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక క్లస్టర్లుగా అభివృద్ధి
ఉమ్మడి జిల్లాలోని శ్రీకాళహస్తి పార్టికల్ బోర్డులు, టైల్స్, చిత్తూరు గ్రానైట్, పూతలపట్టు మ్యాంగో పల్ప్, కుప్పం ఫుడ్ ప్రాసెసింగ్, నగరి పవర్‌లూమ్ పరిశ్రమలను ప్రత్యేక క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరిగే అవకాశముంది.
రైతు యాప్‌లో 57 వేల మంది నమోదు
ఏపీఏఐఎంఎస్ రైతు యాప్‌లో 2,17,395 మంది రైతులను గుర్తించగా, అందులో 57,021 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వారిలో 29శాతం మంది యాప్‌ను యాక్టివ్‌గా వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా రైతులకు పంటలు, మార్కెట్, సబ్సిడీలు, సేవల సమాచారం సమాచారాన్ని నేరుగా అందుతోంది.
స్వచ్ఛాంధ్రకు 18.62 ఎకరాలు
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు 10 ప్రాజెక్టులు ప్రతిపాదించారు. వీటి కోసం 18.62 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, మలిన జల శుద్ధి కేంద్రాలు, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు 15.56 ఎకరాలు అవసరం. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే గ్రామీణ పారిశుధ్యంలో పెద్ద మార్పు వస్తుంది.
గ్రామీణ పారిశుధ్యం, చెత్త సేకరణ, సోర్స్ సెగ్రిగేషన్, ఓడీఎప్ ప్లస్ అమలు వంటి అంశాల్లో 83 మార్కులతో రాష్ట్రంలోనే జిల్లా మెరుగైన స్థానంలో నిలిచింది. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ మార్కెట్
జిల్లాలో తయారయ్యే కర్పూరం, సంప్రదాయ వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏఎన్‌డీసీ వంటి జాతీయ ఈకామర్స్ వేదికలపై విక్రయించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. మహిళా సంఘాలకు ప్రత్యేక ప్యాకేజింగ్, బ్రాండింగ్ సదుపాయలు కల్పించనున్నారు.