రుయాలో జూడాల సమ్మె ఎఫెక్ట్
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:47 AM
రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం రోగులపై పడుతోంది. తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు 12 రోజులుగా అత్యవసర విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే.
అత్యవసర విభాగంలో చిన్నారికి అందని వైద్యం
తిరుపతి సెంట్రల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం రోగులపై పడుతోంది. తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు 12 రోజులుగా అత్యవసర విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముక్కు నుంచి విపరీతంగా రక్తం కారుతున్న ఓ చిన్నారిని రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి కుటుంబీకులకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పుత్తూరుకు చెందిన మాధవి కుమార్తె అన్విశ్రీ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ముక్కు నుంచి విపరీతంగా రక్తం కారుతుండడంతో శనివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో రుయా అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఇక్కడ అడ్మిషన్లు లేవు.. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. మేమేమీ చేయలేం. డాక్టర్ వస్తే చెప్తాం.. అంతవరకు బయట కూర్చోండి.. అని చెప్పడంతో కుటుంబీకులు అత్యవసర విభాగం వద్ద పడిగాపులు కాశారు. ఎంతసేపటికీ వైద్యులు స్పందించక పోవడంతో ఇంటికి వెనుదిరిగారు. కాగా, అత్యవసర విభాగంలో చిన్నారికి వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలొచ్చాయి. రోజూ ఇలాగే ఎందరో ఇబ్బంది పడుతున్నా.. వైద్యులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయమై రుయా సూపరింటెండెంట్ మనోహర్‌ను వివరణ కోరగా.. డాక్టర్లు కాల్ డ్యూటీలో ఉంటారని, అత్యవసర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని తెలిపారు. సోమవారం వస్తే అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.