Share News

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:15 AM

కలకడ కేంద్రంగా దందా పెద్దల ప్రమేయంతో పట్టించుకోని పోలీసులు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా
గత ఏడాది జనవరి 15వ తేదీన గుర్రంకొండ వద్ద పట్టుబడిన బియ్యం లారీ

అన్నమయ్య, ఏప్రిల్‌ 6(ఆంరఽధజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు ప్రతినెలా చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోవడం లేదు. ఈ క్రమంలో కొందరు దీన్ని వ్యాపారంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్ల వద్దకే వెళ్లి కిలో రూ.9 నుంచి రూ.10 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లెతోపాటు పక్కనే ఉన్న కడప జిల్లా నుంచి కొనుగోలు చేసి కలకడ మండలానికి తరలించి నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు.

వయా గుర్రంకొండ టు బెంగళూరు

కలకడ మండల పరిధిలో నిల్వ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని గుర్రంకొండ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారు. రోజుకు కనీసం ఒక లోడు లారీ రేషన్‌బియ్యం కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. గుర్రంకొండ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట, పీటీఎం మండలాల సరిఽహద్దులో ఉన్న చెక్‌పోస్టులు మూతపడటంతో ఎటువంటి అటంకాలు లేకుండా అక్రమ రవాణా జరుగుతోంది. గత ఏడాది జనవరి 15న గుర్రంకొండ మీదుగా వెళ్తున్న రేషన్‌ బియ్యం లారీలను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అయితే వాటిపై ఎటువంటి కేసులూ నమోదు చేయలేదు. వాస్తవానికి లారీలు పట్టుబడినప్పుడు లేని అనుమతులు సాయంత్రానికి పుట్టుకొచ్చాయి. పోలీసులు వాటిని వదిలేశారు. 2024 డిసెంబర్‌ 9న కలకడ మండలంలో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి 151 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాఽధీనం చేసుకున్నారు. తాజాగా మార్చిలో కలకడ మండలం బాటవారిపల్లె పంచాయతీ పరిధిలో అక్రమంగా దాచి ఉంచిన రేషన్‌ బియ్యం నిల్వలపై కడప విజిలెన్స్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 14 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, సద్దాం అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ దందాలో కొందరు రేషన్‌ డీలర్లు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌కు చెందిన ముఖ్య నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రత్యేక నిఘా పెట్టాం

పేదలకు అందే బియ్యంపై అప్రమత్తంగా ఉండాలని సివిల్‌సప్లై డిప్యూటి తహసీల్దార్లను హెచ్చరించాము. ప్రతి నెలా సివిల్‌ సప్లై డిప్యూటి తహసీల్దార్లతో జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నాము. చౌకదుకాణాల తనిఖీ, బియ్యం పంపిణీపై నిఘా ఉంచుతున్నాము. ఎవరైనా డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే.. వాపై కేసులు నమోదు చేస్తాం. బియ్యం అక్రమ రవాణా ఆరోపణలపై.. జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు.. ఈనెల నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం.

- సుమతి, జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ అధికారిణి

Updated Date - Apr 07 , 2026 | 02:15 AM