ఎన్‌ఆర్‌ఐ ఇంటి పన్ను అక్రమ మార్పు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:01 AM
ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు చెందిన ఇంటి పన్నును అక్రమంగా మరొకరి పేరిట మార్చిన వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది.
తిరుపతి(నేరవిభాగం), మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు చెందిన ఇంటి పన్నును అక్రమంగా మరొకరి పేరిట మార్చిన వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు భూపతి నాయుడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.ఎన్‌ఆర్‌ఐ వడ్డిమూరి సరోజినికి చెందిన ఇంటి పన్నును మరొకరి పేరిట మార్చి, ఆ ఇంటిని విక్రయించేందుకు యత్నిస్తున్న విషయాన్ని బాధితురాలు గుర్తించారు. ఆమె తరపున టీడీపీ నాయకుడు మురళి గతనెల 16వ తేదీన మున్సిపల్ కమిషనర్ మౌర్యకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.అలాగే దీనిపై సరోజిని అలిపిరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.సత్యనారాయణపురంలోని డోర్ నెంబర్ 21-8-64-5ఇంటిని 2023లో మేకల వెంకటయ్య నుంచి సరోజిని కొనుగోలు చేశారు. అయితే ఇంటిపన్ను అసెస్మెంట్ నెంబర్ 1012062814 మాత్రం వెంకటయ్య పేరిటే కొనసాగుతోందని సరోజిని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉంటున్నందున ఆ ఇంటిని వి. భూపతి అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చానని, అయితే భూపతి గతనెల 21వ తేదీన ఆ ఇంటి అసెస్మెంట్‌ను భువనేశ్వరి పేరున మార్చి, ఇంటిని రిజిస్టర్ చేసుకునేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అలిపిరి పోలీసులు నిందితుడిని బుఽధవారం అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొందరు ఇంటి పన్నులను ఇతరుల పేరుపై మార్పుచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలకు ఈ అరెస్ట్ తావిస్తోంది. దర్యాప్తు సందర్భంగా ఇంటి పన్ను పేరుమార్పు ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలో భూపతి నాయుడిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కేసులో మరికొందరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా జరిగితే కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటి పన్నులను ఒకరి పేరు నుంచి అక్రమంగా ఇంకొకరి పేరిట మార్చే దందా ఎలా జరుగుతుందో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారిక రికార్డుల్లో మార్పులు చేయడానికి ఎవరి సహకారం తీసుకున్నారు, ఈ వ్యవహారంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ప్రమేయం ఉందా అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే ఇలాంటి అక్రమ మార్పులు మరెన్ని చోటుచేసుకున్నాయో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి.మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నుల రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాలు కూడా దర్యాప్తులో బహిర్గతమయ్యే అవకాశముంది.