Share News

జాతరకు వెళ్లాలనుకుంటే.. ఇలా అయిందేమయ్యా

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:42 AM

విషవాయువు పీల్చి తాత.. ముగ్గురు పిల్లల మృతి

 జాతరకు వెళ్లాలనుకుంటే.. ఇలా అయిందేమయ్యా

పుంగనూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తెల్లారగానే అత్తవారింట జాతర. ముగ్గురు పిల్లలు, భార్యతో వెళ్లేందుకని శనివారం ద్విచక్ర వాహనాన్ని బోరు చేయించారు మురళి. అదే ఆ ఇంట మృత్యువుగా మారుతుందని ఊహించలేకపోయారు. కూలింగ్‌కని ఇంట్లోనే ద్విచక్ర వాహనం స్టార్టు చేసి ఉంచగా.. ఆ విషవాయువు పీల్చుకుని తాత, ముగ్గురు పిల్లలు మృతిచెందడంతో విషాదం నెలకొంది. పుంగనూరు త్యాగరాజవీధికి చెందిన బజంత్రీ మురళి ఓ సెలూన్‌ షాపులో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి రామచంద్రయ్యదీ ఇదే వృత్తి. సదుం మండలం తూగుంటపల్లెకి చెందిన రేవతితో ఇతడికి వివాహమైది. కుమార్తె సుమబిందు (15), కుమారుడు కార్తీక్‌ (12), కవలలు చందన(7), సరిత(7) పిల్లలు. వీరు 9, 7, ఒకటో తరగతి చదువుతున్నారు. ఆదివారం అత్తగారి ఊర్లో జాతరకు వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనానికి శనివారం బోరు చేయించారు. 12 గంటలు కూలింగ్‌ (స్టార్టింగు)లో పెట్టాలని మెకానిక్‌ చెప్పారు. బయట ఉంచితే దొంగలు తీసుకెళతారని.. ఇంట్లో ద్విచక్ర వాహనాన్ని స్టార్టింగులో ఉంచారు. దీన్నుంచి విడులయ్యే కార్బన్‌ మోనాక్సిడ్‌ ప్రాణాంతకమన్న అవగాహన వీరికి లేకుండా పోయింది. మరోవైపు తలుపు గడియ పెట్టడం.. ఉన్న ఒక కిటికీ మూసివేయడంతో ఆ పొగ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మంచంపై తాత, కవల మనవరాళ్లు, చాపపై మనవడు పడుకున్నారు. మురళి, రేవతి దంపతులు మిద్దెపైకి వెళ్లారు. ఆదివారం ఉదయాన్నే వీరు కిందకు వచ్చి తలుపులు కొట్టినా, పిలిచినా ఎవరూ పలకలేదు. అనుమానం వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా నలుగురూ నిర్జీవంగా పడున్నారు. సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాషా, ఏఎ్‌సఐ అశ్వర్థనారాయణ అక్కడికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలియగానే అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నేత మధుసూదన్‌నాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాషా మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేశారు. వీరిని ఆదుకోవాలని నాయీబ్రాహణ సంఘ నేత వెంకటేశ్‌ కోరారు.

అమ్మమ్మ ఇంటికెళ్లడంతో..

కాగా, అమ్మమ్మ ఊరైన తూగుంటవారిపల్లెలో ఆదివారం జరిగే గంగజాతరకోసం శుక్రవారమే మురళి పెద్దకుమార్తె సుమబిందు వెళ్లింది. మిగిలిన పిల్లలు, తల్లిదండ్రులు ఆదివారం వెళ్లాల్సి ఉంది. ఇంతలో శనివారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో సుమబిందు ప్రాణాలతో బయటపడింది.

పుట్టుక.. మృత్యువులోనూ కలిసే

రేవతికి మూడో కాన్పులో సరిత, చందన కవల పిల్లలు జన్మించారు. ఇలా కలిసే పుట్టిన వీరు.. ఏడేళ్ల వయసులో కలిసే మృతిచెందారు.

Updated Date - Mar 16 , 2026 | 12:42 AM