Share News

కుప్పం తలచుకుంటే రికార్డులు బద్దలుకావా!

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:47 AM

‘ఇప్పుడు సాధించిన గిన్నిస్‌ రికార్డు ఒక్కటే కాదు, భవిష్యత్తులో ఇటువంటివి మరెన్నో సాధించి రికార్డులు బద్దలు కొట్టే శక్తి కుప్పానికి ఉంది’ అని నియోజకవర్గ ప్రజలపై విశ్వాసం ఉంచి సీఎం చంద్రబాబు పలికన పలుకులివి. శాంతిపురం మండలం తుమ్మిశి ఆదర్శ పాఠశాల సమీపంలో శనివారం నిర్వహించిన ‘పేదల సేవలో ప్రజా వేదిక’ సభలో ఆయన ప్రసంగించారు.

కుప్పం తలచుకుంటే రికార్డులు బద్దలుకావా!
ప్రజావేదిక సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

మెడికల్‌ హబ్‌గా మారుస్తా

మీరు ఓటేసిన సైకిల్‌ మీ జీవితాల్లో మార్పు తెచ్చింది

మరో జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా

‘ప్రజావేదిక’లో సీఎం చంద్రబాబు ప్రసంగం

కుప్పం/ శాంతిపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘ఇప్పుడు సాధించిన గిన్నిస్‌ రికార్డు ఒక్కటే కాదు, భవిష్యత్తులో ఇటువంటివి మరెన్నో సాధించి రికార్డులు బద్దలు కొట్టే శక్తి కుప్పానికి ఉంది’ అని నియోజకవర్గ ప్రజలపై విశ్వాసం ఉంచి సీఎం చంద్రబాబు పలికన పలుకులివి. శాంతిపురం మండలం తుమ్మిశి ఆదర్శ పాఠశాల సమీపంలో శనివారం నిర్వహించిన ‘పేదల సేవలో ప్రజా వేదిక’ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజారోగ్యానికి సంబంధించి కుప్పంలో మొదలు పెట్టిన సంజీవిని ప్రాజెక్టుతో నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శమైన మెడికల్‌ హబ్‌గా రూపొందిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ-సైకిల్‌ను తీసుకు వచ్చానన్నారు. ఇంకా అనేక పర్యావరణ హితమైన ప్రాజెక్టులతో కుప్పం నియోజకవర్గాన్ని హెల్దీ, హ్యాపీ సొసైటీగా చేస్తానన్నారు. ఇప్పటికే సూర్యఘర్‌ పేరుతో సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టు కుప్పంలో నడుస్తున్నదని గుర్తు చేశారు. ఎక్కువ రోజులు బతకాలనుకుంటే కుప్పం వస్తే చాలని ప్రపంచం భావించేలా ఇక్కడ పర్యావరణ పరిరక్షణ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో అనీమియా, బీపీ, షుగర్‌ తదితర వ్యాధులు అధికంగా ఉన్నాయని తేలిందన్నారు. అందుకోసమే సంజీవిని ప్రాజెక్టు తెచ్చానని, కుప్పం ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రథమ కర్తవ్యమన్నారు.

సైకిల్‌తో జీవితాల్లో మార్పు

‘ఎక్కడికైనా దూసుకుపోయే ఈ సైకిల్‌.. సూపర్‌ సైకిల్‌. ఇదే మీ జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చింది. ఈ సైకిళ్లకోసం ప్రత్యేక పవర్‌ స్టేషన్లు, సైకిల్‌ ట్రాక్‌లు, అద్దె సైకిల్‌ పద్ధతికి కుప్పనుంచే శ్రీకారం చుట్టి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తా. ఈ సైకిల్‌ వినియోగంతో ఆరోగ్యం, ఆనందం దక్కుతుంది. ఇప్పటికే కుప్పంలో రూ.7088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు తీసుకొచ్చా. ఇప్పుడు రూ.780 కోట్లతో మరో 9 కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. దీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని చంద్రబాబు వివరించారు.

భూగర్భాన్ని జలాశయం చేద్దాం

కురిసే వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భాన్ని పెద్ద జలాశయంలా మారుద్దామని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘కృష్ణా జలాలతో కళకళలాడుతున్న చెరువులను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇదే చాలదు. వాన నీటిని మనం భూగర్భ జలంగా మార్చుకోవాలి. భూగర్భాన్ని అతిపెద్ద జలాశయం చేయాలి. అప్పుడే కరువు పరిస్థితులు కుప్పంనుంచే కాదు, రాష్ట్రంనుంచే పలాయనమవుతాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరిగిన జల వనరులు, ఉద్యాన పంటలతో ఒకప్పటి కరువు సీమ రాయలసీమను, హార్టికల్చర్‌ హబ్‌గా చేసి ఆ రంగంలో నెంబర్‌ వన్‌గా నిలుపుదామన్నారు. చెరువులకు ఒకప్పుడు ఉన్న దార్లను మూసేశారన్నారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ మళ్లీ తెస్తామని, ఎక్కడైనా ఎవరైనా ఆక్రమించి ఉంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ఆవులు పట్టిస్తానంటే నవ్వారు

ఒకప్పుడు ఆవులు పట్టిస్తా.. జీవితాలు బాగుపడుతాయంటే నవ్వారని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి ఆవులే తర్వాత కుటుంబాలకు ఆదాయ వనరులుగా మారాయన్నారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో 5.6 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 80 వేల లీటర్ల ఉత్పత్తి పెరిగిందని లెక్కలు చెప్పారు.

ఈయనిట్లే మాట్లాడతాడనుకుంటే కుదరదు

కుప్పం నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఎన్నో చేస్తానని, ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా నిలుపుతానని సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో చెప్పారు. ఆఖరున ‘ఈయనిట్లే మాట్లాడుతాడులే, మేం ఇట్లే ఉంటాములే అంటే కుదరదు. నేను ఎన్ని చెప్పినా సాయంత్రం నాలుగు క్వార్టర్లు మందేస్తే నేను చెప్పిన మందు పనిచేయదు’ అని చమత్కారంగా అన్నారు. ప్రజల్లోనూ చైతన్యం రావాలని, జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకుని కష్టపడి ముందుకు పోవాలన్న తపన ఉండాలన్నారు. ఏఐ టెక్నాలజీ, డ్రోన్‌ టెక్నాలజీ, స్పేస్‌ టెక్నాలజీ ద్వారా జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పడం ఇప్పుడు ఊహాజనితంగానే అనిపించినా.. అవన్నీ సాధ్యమేనని, ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తనకు మరో జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుట్టాలని, మళీమళ్లీ ఇక్కడినుంచే ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటానని చంద్రబాబు అన్నారు.

ఈ- సైకిల్‌ జోరు

కుప్పంలో ఈ-సైకిల్‌ జోరుగా దూసుకెళ్లింది. కడపల్లెలోని ఇంటి నుంచి ఇ-సైకిల్‌పై సీఎం చంద్రబాబు బయలుదేరారు. మూడు కిలోమీటర్ల దూరంలోని తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ సమీపం ప్రజావేదిక వద్దకు బ్యాటరీ ఆన్‌ చేయకుండా తొక్కుకుంటూ వచ్చారు. ర్యాలీగా మరికొందరు ఆయన్ను అనుసరించారు.

పేదల సేవలో..

శనివారం ఉదయం శాంతిపురం మండలం కడపల్లె సమీపం శివపురం వద్ద స్వగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గుడుపల్లె మడలం బెగ్గిలపల్లెకు చేరుకున్నారు. ‘పేదల సేవలో..’ కార్యక్రమం కింద ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మునెమ్మ, వెంకట్రామప్పకు వృద్ధాప్య.. చినతాయారుకు వితంతు పింఛను అందజేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. గ్రామంలో వీధుల గుండా నడిచే సమయంలో చూడడానికి వచ్చిన జనాలకు అభివాదం చేశారు.

నేటి సీఎం కార్యక్రమాలిలా

ఫ ఆదివారం ఉదయం తుమ్మిశి ఆరోగ్య ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టు ‘సంజీవిని’ అమలు తీరును పరిశీలించనున్నారు. రోగులతో మాట్లాడనున్నారు. తాను తనిఖీలకు వస్తానని గతంలో చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు ఈ తనిఖీలు చేయనున్నట్లు తెలిసింది. అనంతరం తుమ్మిశిలోని మోడల్‌ స్కూల్‌ సమీపంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

- కుప్పం/శాంతిపురం/గుడుపల్లె

Updated Date - Feb 01 , 2026 | 01:47 AM