Share News

ప్లాట్‌ కొంటే... బఫర్‌ జోన్‌లో భూమి ఫ్రీ

ABN , Publish Date - May 16 , 2026 | 01:27 AM

ఓ ప్లాట్‌ కొంటే ... పక్కనే బఫర్‌ జోన్‌లో కొంత భూమి ఉచితం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వెంకటగిరిలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌.

ప్లాట్‌ కొంటే... బఫర్‌ జోన్‌లో భూమి ఫ్రీ
అమ్మవారి పేట చెరువులో అక్రమ నిర్మాణం

వెంకటగిరి, మే 15(ఆంధ్రజ్యోతి): ఓ ప్లాట్‌ కొంటే ... పక్కనే బఫర్‌ జోన్‌లో కొంత భూమి ఉచితం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వెంకటగిరిలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. పట్టణ నడిబొడ్డున ఉన్న అమ్మవారిపేట చెరువు సమీపంలో సుమారు 37 సెంట్ల సెటిల్‌మెంట్‌ భూమి ఉంది. దీనికి ఆనుకొని ఉన్న స్థలం అమ్మవారిపేట చెరువు బఫర్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడ భారీగా ప్లాట్లు విక్రయించడం,నిర్మాణాలు కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది.చెరువు పరిరక్షణ కోసం ఉండాల్సిన బఫర్‌ జోన్‌ను కొందరు రియల్టర్లు ప్లాట్ల అమ్మకానికి అదనపు ఆకర్షణగా చూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్లాట్‌తో పాటు పక్కనే కొంత అదనపు స్థలాన్ని ఉపయోగించుకోవచ్చని కొనుగోలుదారులకు చెబుతుండడంతో అనేక మంది ప్లాట్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అమ్మవారిపేట చెరువు పరిసరాల్లో కొన్నేళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువు సరిహద్దులు, బఫర్‌జోన్‌ గుర్తింపుపై స్పష్టత లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బఫర్‌ జోన్‌ను పరిరక్షించాల్సిన మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం, స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలున్నాయంటూ వైసీపీ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బఫర్‌జోన్‌లో భూములు కబ్జా అవడం భవిష్యత్‌లో వరద ముప్పునకు దారి తీస్తుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ను అడగ్గా బఫర్‌ జోన్‌లో చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 01:27 AM