Share News

ఇలైగైతే ఆదాయమెలా‘గండి’

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:57 AM

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఆడిట్‌ అంతంత మాత్రమే! ఐదు నెలలుగా ఇన్‌ఛార్జితో కాలక్షేపం విలువైన లావాదేవీల

ఇలైగైతే ఆదాయమెలా‘గండి’

చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి: రిజిస్ట్రేషన్‌ జరిగే ఆస్తి విలువ తగ్గించి చూపుతారు. ఒక్కోసారి ఇంటిని షెడ్డుగా పేర్కొంటారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది. ఇలా దారి మళ్లిన ఆదాయంలో వాటాలుంటాయి. వీటిని ఆడిట్‌లో నిగ్గుతేల్చాలి. కానీ, సిబ్బంది కొరతతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆడిట్‌ అంతంత మాత్రంగానే సాగుతోంది.

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మూడు నెలలకోసారి ఆడిట్‌ చేయాలి. సదరు శాఖకు సంబంధించి ఆదాయ వ్యవహారాలను ఆడిటింగ్‌ చేసి స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖ డీఐజీకి నివేదిక ఇవ్వాలి. రూ.5 లక్షల లావాదేవీలకు పైగా జరిగిన డాక్యుమెంట్లను అధికారులు నేరుగా పరిశీలించాలి. తేడాలుంటే నోటీసులివ్వాలి. సిబ్బంది కొరత, పని ఒత్తిడి, ఆడిట్‌ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఆస్తుల రిజిస్ర్టేషన్‌ రుసుం, ఈసీ, నకళ్లు, పెళ్లిళ్ల రిజిస్ర్టేషన్లు, స్టాంపుల విక్రయాలు తదితర సేవల ద్వారా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖకు ఏటా రూ.550 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది. పలుచోట్ల డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌ రిజిస్ర్టార్లు కుమ్మక్కై మార్కెట్‌ విలువలు తగ్గించి రిజిస్ర్టేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి పురపాలక సంఘాలు, పంచాయతీల పరిధిల్లో పొలాలు, స్థలాల రిజిస్ర్టేషన్లు జరిగినప్పుడు ఆస్తుల విలువల్లో 7.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ఇందులో ఐదు శాతం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు, 1.5శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ ఒక శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజు కింద తీసుకుంటారు. ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద వసూలయ్యే 1.5 శాతం స్థానిక సంస్థలకు చెందుతుంది.

రెండు జిల్లాలకు ఒక్కరే

చిత్తూరు జిల్లాలో 8, తిరుపతి జిల్లాలో 16 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలున్నాయి. వీటికి సంబంధించి చిత్తూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మార్కెట్‌ వ్యాల్యూ, ఆడిట్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఆడిటింగ్‌ తనిఖీలు చేయాలి. ఈయన ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 5 లక్షల లావాదేవీలకుపైగా జరిగిన డాక్యుమెంట్లను.. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ పద్ధతిలో జరిగిన రిజిస్ర్టేషన్లను పరిశీలించాలి. కానీ, రెండు జిల్లాల్లో తిరగలేక ఆడిట్‌ ప్రక్రియను సంతకాలకే పరిమితం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కాగా, ఐదు నెలల క్రితం జిల్లా మార్కెట్‌ వ్యాల్యూ, ఆడిట్‌ ఆఫీసర్‌గా కొనసాగిన మునిశంకరయ్య డీఐజీగా ప్రమోషన్‌ రావడంతో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి జిల్లా రిజిస్ర్టార్‌ శ్రీరామ్‌కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించింది.

సగానికిపైగా జరగని ఆడిట్‌!

ఉమ్మడి జిల్లాలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈఏడాది జనవరి వరకు రూ.5 లక్షలకు పైగా విలువైన లావాదేవీలు 13- 15వేలకు మించి జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.100 కోట్ల వరకు సమకూరింది. అయితే ఇందులో సగానికి పైగా డాక్యుమెంట్లపై ఆడిట్‌ జరగలేదని సమాచారం. వీటిలోనూ ఎక్కువ స్థిరాస్థి వెంచర్లకు సంబంధించినవేనని తెలిసింది. విలువ తగ్గించి చూపి కొన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్‌ రైటర్లు స్టాంపు డ్యూటీకి గండి కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పలు డాక్యుమెంట్లపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకూ ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో సమగ్రంగా ఆడిట్‌ జరిపితే ఇలాంటి వాటిని నివారించవచ్చు.

Updated Date - Feb 08 , 2026 | 12:57 AM