ఆవుల పని లేకుంటే..!
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:53 AM
‘ఆవులు, ఇతర పనులున్నాయి. వీటిని చూసుకుని సాయంత్రం వస్తా’నని మాధవి భర్త కన్నయ్య ఆగిపోయారు. దీంతో అక్క మాధవితో పాటు అమ్మ, మేనకోడలిని పెళ్లికి తీసుకెళ్లేందుకు రాజశేఖర్ బంధువులతో కలిసి ఆటోలో వారింటికి వెళ్లారు.
ఆ ముగ్గురికి ప్రమాదం తప్పేదేమో?
గాదంకి వద్ద ప్రమాద మృతుల్లో నలుగురిదీ ఒకటే కుటుంబం
‘ఆవులు, ఇతర పనులున్నాయి. వీటిని చూసుకుని సాయంత్రం వస్తా’నని మాధవి భర్త కన్నయ్య ఆగిపోయారు.
దీంతో అక్క మాధవితో పాటు అమ్మ, మేనకోడలిని పెళ్లికి తీసుకెళ్లేందుకు రాజశేఖర్ బంధువులతో కలిసి ఆటోలో వారింటికి వెళ్లారు. ఇలా వస్తూ ప్రమాదంలో ఈ నలుగురూ మృతిచెందారు. మిగతా బంధువులు గాయపడ్డారు. ఒకవేళ కన్నయ్యకు పని పడకుంటే.. ఈ ప్రమాదం తప్పేదేమోనని బంధువులు పేర్కొంటున్నారు.
పులకింటి రాజశేఖర్‌ది యాదమరి మండలం పెరుమాళ్లపల్లె ఆది ఆంధ్ర దళితవాడ. ఇతడి సోదరి మాధవిని చిత్తూరు రూరల్ మండలం ఏనుగుండ్లపల్లె ఏఏడబ్ల్యూకు చెందిన కన్నయ్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈమెకు పదో తరగతి చదివే కుమార్తె మేఘన ఉంది. ఈమె తల్లి బేబమ్మ కూతురి వద్దకొచ్చారు. వీరిది నిరుపేద కుటుంబం. ఉపాధి.. పెళ్లిళ్ల సందర్భంగా కల్యాణ మండపాల్లో పనులకు వెళ్లడం ద్వారా కుటుంబం గడుస్తోంది. చంద్రగిరి సమీపం అమేపల్లెలో గురువారం జరిగే తన బావ కుమారుడి పెళ్లికి తల్లి బేబమ్మ, కుమార్తె మేఘనతో కలిసి మాధవి బయలుదేరారు. భర్త కన్నయ్య, మామ కుప్పయ్య ఆవులు, ఇతర పనులు చూసుకుని సాయంత్రం బస్సుకు వస్తామని చెప్పారు. దీంతో ఈమె తమ్ముడు రాజశేఖర్ పెరుమాళ్లపల్లె నుంచి ఇతర బంధువులతో ఆటోలో వెళుతూ, సోదరి ఇంటికెళ్లి వాళ్లనూ తీసుకొని బయలుదేరారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి వద్ద సడెన్‌గా ఆగిన లారీని.. వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో బేబమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్, కుమార్తె మాధవి, మనవరాలు మేఘన.. నలుగురూ మృతిచెందారు. ఒకవేళ కన్నయ్యకు ఎలాంటి పని లేకుంటే, ఆయన కుటుంబంతో కలిసి ఈ ఆటోలో కాకుండా వేరుగా వెళ్లుంటే ఈ ముగ్గురికీ ప్రమాదం తప్పేదేమో? ఇక, పెరుమాళ్లపల్లె నుంచీ ఆటో కాస్త ముందు వెళ్లడం ద్వారా వారికీ ఈ ఘటన జరిగి ఉండకపోవచ్చునని వీరి బంధువులు చెబుతున్నారు. ఇక, ఎన్నో ఏళ్లుగా వీరంతా తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, బంగారుపాళ్యం, తదితర ప్రాంతాల్లో కళ్యాణ మండపాల్లో జరిగే పెళ్లిల్లో క్లీనింగ్ పనులకు రాత్రనక, పగలనక ఆటోల్లో, లారీల్లో వెళ్లి వచ్చేవారు. అప్పుడంతా బాగుండి.. బంధువుల పెళ్లికి వెళుతూ ఇలా ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం రెండు గ్రామాల్లో విషాదం నింపింది.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి