Share News

ఇలాగైతే.. గణన ఎలాగ?

ABN , Publish Date - May 25 , 2026 | 01:01 AM

జిల్లాలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో గణకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి పెద్ద కొన్ని ప్రశ్నలకు సర్వేకు సంబంధించి జవాబు దాటేస్తుంటే మరికొన్ని చోట్ల డోర్‌ నెంబరు కలిగి శాశ్వతంగా, తాత్కాలికంగా మూతపడ్డ ఇళ్లతో సమస్యలు తీవ్రమవుతున్నాయి.

ఇలాగైతే.. గణన ఎలాగ?
బంగారుపాళ్యం మండలంలోని కమ్మనపల్లెలో ఇంటికి వేసిన తాళం

డోర్‌ నెంబరు ఉండీ మూతపడ్డ 84,184 వేల ఇళ్లతో సమస్యలు

రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న వింత పరిస్థితి

చిత్తూరు కలెక్టరేట్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో గణకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి పెద్ద కొన్ని ప్రశ్నలకు సర్వేకు సంబంధించి జవాబు దాటేస్తుంటే మరికొన్ని చోట్ల డోర్‌ నెంబరు కలిగి శాశ్వతంగా, తాత్కాలికంగా మూతపడ్డ ఇళ్లతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆ ఇళ్లల్లో నివాసముంటున్నారో లేదో అనే వివరాలు గ్రామీణ ప్రాంతాల్లో చెబుతున్నా మున్సిపల్‌ ప్రాంతాల్లో, చిత్తూరు నగరంలో మాత్రం తమకు తెలియదనే సమాధానం వస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని 13 మండలాల్లో ఇలాంటి సంకట పరిస్థితి అధికంగా ఉందని గణకులు వాపోతున్నారు. శాశ్వతంగా మూతపడ్డ ఇళ్లు 78,629.. తాత్కాలికంగా మూతపడ్డవి (డోర్‌ లాక్డ్‌) 5555 ఇళ్లున్నాయి. దీనివల్ల ఇళ్ల గణనలో చిత్తూరుజిల్లా వెనుకబడి పోతోంది. డోర్‌ నెంబర్లున్న ఇళ్ల పరిస్థితి ఇలాగుంటే డోర్‌ నెంబర్లు లేకుండా అక్కడక్కడా శివారులో వాటి గణన మరింత క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో 30వ తేదీలోగా ఇళ్ల గణన ఎలా పూర్తి చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది.

5,97,046 ఇళ్ల గణన పూర్తి

జిల్లాలో 28 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 5,87,827 ఇళ్లు ఉండగా.. ఆదివారం నాటికి 5,97,046 ఇళ్ల గణన పూర్తయింది. ఇందులో పలు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు నివాసాల్లేకుండా 84,184 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో మున్సిపాలిటీలు.. కుప్పంలో 3980, పలమనేరులో 4086, నగరిలో 2658, మండలాలు.. వీకోటలో 3457, బంగారుపాళ్యంలో 3007, గంగవరంలో 2757 చొప్పున (గ్రామీణ, మున్సిపల్‌ ప్రాంతాల్లో) 78,629, చిత్తూరు నగరంలో 5555 ఇళ్లున్నాయి. ఇక తాత్కాలికంగా మూతపడ్డ (డోర్‌ లాక్డ్‌) ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 4333, చిత్తూరు నగరంలో 1222 కలిపి 5555 ఉన్నాయి. జిల్లా సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నివసిస్తూ జిల్లాలో సైతం ఉంటూ పింఛన్లు, రేషన్‌ బియ్యం వంటి పథకాలను పొందేందుకు సమీపంలోని 13 మండలాల ప్రజలు వస్తుంటారని గుర్తించారు. వీరంతా ప్రతి నెలా 1-5 తేదీల మధ్య జిల్లాకు వచ్చి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఫోన్‌ ద్వారా వివరాలను సేకరించేందుకు గణకులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - May 25 , 2026 | 01:01 AM