Share News

మల్లయ్యకొండ జోలికొస్తే ఊరుకోం

ABN , Publish Date - May 30 , 2026 | 12:43 AM

మైనింగ్‌ పేరుతో తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, మల్లయ్యకొండల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానికులు, భక్తులు హెచ్చరించారు. శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల నేతలు, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టు సభ్యులు, స్థానికులు మల్లయ్యకొండ కింద అన్నదాన కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.

మల్లయ్యకొండ జోలికొస్తే ఊరుకోం
మాట్లాడుతున్న అన్నదాన ట్రస్టు సభ్యులు, స్థానికులు, భక్తులు

- మైనింగ్‌ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలి

- ప్రాణత్యాగానికీ వెనకాడబోమన్న స్థానికులు, భక్తులు

తంబళ్లపల్లె, మే 29(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌ పేరుతో తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, మల్లయ్యకొండల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని స్థానికులు, భక్తులు హెచ్చరించారు. శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల నేతలు, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టు సభ్యులు, స్థానికులు మల్లయ్యకొండ కింద అన్నదాన కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. సాధు, ఇనుము, మల్లయ్యకొండలను భక్తులు పవిత్రంగా భావిస్తారన్నారు. ఈ మూడు కొండల చుట్టూ 300కు పైగా పల్లెలు ఉన్నాయని, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామన్నారు. ఈ కొండల్లో మైనింగ్‌ చేపడితే భూములు దుమ్ము, ధూళితో నిండిపోయి మొత్తం ఎడారిగా మారుతుందన్నారు. తద్వారా తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. సాధు, మల్లయ్యకొండల్లో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడని, నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన కొండలను ఆధ్యాత్మికంతో పాటు పర్యాటకంగా అభివృద్ది చేయాలే కాని మైనింగ్‌ పేరుతో ధ్వంసం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్‌ ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం కాదని ఈ మూడు కొండల జోలికొస్తే పెద్దయెత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆశ్రమం శ్రీకృష్ణ చైతన్య స్వామి, అన్నదాన ట్రస్టు సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి, కరీం, రామ్మూర్తి, శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్‌ మణి, నాగసుబ్బారెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:43 AM