ఓ అమ్మాయి చదువుకుంటే.. కుటుంబమంతా విద్యా వెలుగులే
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:57 AM
Former Vice President Venkaiah Naidu commented that if a girl is educated, it is as if the whole family is educated.
యోగా, వ్యాయామం, ఆటలు నేర్చుకోండి
సమాజసేవ అలవర్చుకోండి
విద్యార్థినులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన
చిత్తూరు సెంట్రల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఒక అమ్మాయి చదువుకుంటే.. ఆ కుటుంబమంతా చదువకున్నట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. చిత్తూరులో గురువారం జరిగిన ఎన్‌పీ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల 44వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లడారు. చదువుతో పాటు యోగా, వ్యాయామం, నడవటం, ఆటలాడటం నేర్చుకోవాలన్నారు. యోగా మోదీ కోసం కాదని, శరీరానికి అవసరమని గుర్తించాలన్నారు. మీ చేతి వృత్తులను గౌరవిస్తూ, వాటిని నేర్చుకోవాలని హితవు పలికారు. ‘పోండి.. సంపాదించండి.. నేర్చుకోండి.. తిరిగిరండి... భావితరాలకు గుర్తుండేలా సమాజానికి సేవ చేయడం అలవర్చుకోండి. ఉన్నత స్థాయికి ఎదిగాక మీరు చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి సహకరించండి’ అని సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో త్వరలో 33 శాతం మహిళా బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించనుందన్నారు. నేటి యువత.. భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టడం ద్వారా పలువురికి ఉపాధి కల్పించే వీలుందన్నారు. ఈ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించిన బీసీ మహిళా భవనంలో 200 మందికిపైగా వసతి పొందవచ్చని, తద్వారా మీ కుటుంబ సభ్యులపై భారం తగ్గుతుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ఐఏఎస్ 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన.. అప్పట్లో ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. దాతలు, ప్రభుత్వాలిచ్చే సౌకర్యాలను విద్యార్థినులు అందిపుచ్చుకుని జీవితంలో రాణించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. సమాజంలో మార్పు రావాలంటే చదువు ద్వారానే సాధ్యమవుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఎన్నో పదవులు అలంకరించిన వెంకయ్యనాయుడు.. చివరకు భారత అత్యున్నత పదవిలో ఉంటూ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని కళాశాల సీపీడీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి వివరించారు. బీసీ మహిళా భవన నిర్మాణానికి నిధులిచ్చిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడి చొరవతో చిత్తూరు కార్పొరేషన్‌కు అమృత్ పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందని చుడా ఛైర్‌పర్సన్ కటారి హేమలత అన్నారు. ‘చదువు, వైద్యం, పింఛన్లు తప్ప మిగిలిన ఉచితాలను తీసివేయాలి. ఉచితంగా ఇస్తే దేని విలువ తెలియదు’ అని మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. తాను చదువుకున్న కళాశాలకు తమ విజయం సంస్థల ద్వారా సహకారం అందించడం అదృష్టంగా భావిస్తున్నానని సీపీడీసీ మెంబర్ శైలజామూర్తి అన్నారు.
విద్యార్థినులకు బంగారు పతకాలు
వివిధ గ్రూపుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులకు వెంకయ్యనాయుడు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల ప్రాంగణంలో రూ.కోటితో నిర్మించిన బీసీ మహిళా వసతి గృహాన్ని ప్రారంభించారు. దీని నిర్మాణానికి కలెక్టర్ నిధుల నుంచి రూ.30 లక్షలు, వెంకటేశ్వరచౌదరి కుటుంబం నుంచి రూ.30 లక్షలు, పై అంతస్తు నిర్మాణానికి పూర్వ విద్యార్థిని శైలజామూర్తి ద్వారా నిధులు సమీకరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.