ఒకసారి నీతో మాట్లాడాలి చివరిగా వచ్చిపో
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:39 AM
చివరగా వచ్చిపో’ అంటూ ప్రాధేయపడ్డాడు. నమ్మకంగా గదికి పిలిపించాడు.
తిరుపతి (నేరవిభాగం), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘ఒకసారి నీతో మాట్లాడాలి. చివరగా వచ్చిపో’ అంటూ ప్రాధేయపడ్డాడు. నమ్మకంగా గదికి పిలిపించాడు. గొడవపడి వివాహితను హతమార్చాడు. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధమున్న వీరిద్దరి మధ్య గొడవలతో.. చివరికిలా ప్రాణాలు కోల్పోయారు సాంబాలక్ష్మి(40), సోమశేఖర్(37). ఈ ఘటన తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ ఐదేళ్లుగా కొర్లకుంట మారుతీనగర్‌లో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి 15 ఏళ్ల కిందట నెరబైలుకు చెందిన నందినితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. భార్యతో గొడవల కారణంగా వేరుగా ఉంటున్నాడు. ఇక, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సాంబలక్ష్మి ఐదేళ్ల కిందట తిరుపతికి వచ్చింది. కొంతకాలం జీవకోనలో నివసించేది. ఆ తర్వాత కొర్లకుంట మారుతీనగర్‌లో తన భర్త, కుమారుడితో కలిసి ఉంటోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సమోసాల దుకాణంలో పనిచేసేది. ఈ నేపథ్యంలో ఒక గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్.. సమోసాల దుకాణానికి వచ్చేవాడు. ఈ క్రమంలో సాంబలక్ష్మితో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమశేఖర్‌తో ఈ తలనొప్పి ఎందుకని సాంబలక్ష్మి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. వివాహేతర సంబంధానికి నిరాకరించింది. ఈ క్రమంలో సోమశేఖర్.. చివరిసారిగా ఒకే ఒకసారి నీతో మాట్లాడాలని సోమవారం రాత్రి తన గదికి పిలిపించుకున్నాడు. ఇదే సమయంలో మళ్లీ గొడవ జరిగి.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి హత్య చేశాడు. తనూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ స్వాతి, సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రుయాస్పత్రికి తరలించారు. ఈస్ట్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.