..అనే నేను
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:20 AM
అనే నేను, అంటూ విద్యార్థులు తమ భవితను ఆవిష్కరించారు. భవిష్యత్తులో తాను డాక్టర్, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, ఏఐ ఇంజనీరు.. అంటూ తమ లక్ష్యాలు.. సమాజానికి ఉపయోగపడేలా ఏం చేస్తామనే వివరాలతో చార్ట్ ఫొటో ప్రేమ్‌లను రూపొందించారు.
.. అనే నేను, అంటూ విద్యార్థులు తమ భవితను ఆవిష్కరించారు. భవిష్యత్తులో తాను డాక్టర్, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, ఏఐ ఇంజనీరు.. అంటూ తమ లక్ష్యాలు.. సమాజానికి ఉపయోగపడేలా ఏం చేస్తామనే వివరాలతో చార్ట్ ఫొటో ప్రేమ్‌లను రూపొందించారు. తదనుగుణంగా తమ ఫొటోలను ఏఐ ద్వారా రూపొందించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలోని 115 మంది విద్యార్థులు తమ భవిష్య లక్ష్యాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. వీరిలో 9వ తరగతి చదివే సంతోష్ తన కల జీడీనెల్లూరు ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. దీనికోసం నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటానని, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటానని, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు పెంచుకుంటానని.. తద్వారా మన కోసం పనిచేసే నాయకుడు మన మధ్యనుంచే ఎదిగాడని ప్రజలు గర్వంగా చెప్పుకొనేలా పనిచేస్తానన్నారు. ఏఐ సంబంధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరునై, విద్యారంగానికి ఉపయోగపడేలా యాప్‌ను తయారు చేయడం తన లక్ష్యంగా శర్వాణి పేర్కొన్నారు. ఇలా, విద్యార్థి దశలోనే వారి భవిష్యత్తు, సమాజం పట్ల ఉత్తమ లక్ష్యాలకు బీజం పడేలా చేపట్టిన ఈ ‘..అనే నేను’ గొప్ప కార్యక్రమమని హెచ్‌ఎం రవి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- వెదురుకుప్పం, ఆంధ్రజ్యోతి