జేబీ శ్రీనివాస్ అను నేను.....
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:15 AM
తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో మేయర్‌గా మన్నెం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ చేత కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రమాణం చేయించారు.
-వేడుకగా తిరుపతి మేయర్,డిప్యూటీ మేయర్ ప్రమాణస్వీకారం
-కొలువుదీరిన నూతన కార్పొరేటర్ల పాలకవర్గం
తిరుపతి సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో మేయర్‌గా మన్నెం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ చేత కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రమాణం చేయించారు. అనంతరం 66 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎస్వీయూ సెనేట్ హాల్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో 35వ డివిజన్ నుంచి ఎంపికైన జనసేన పార్టీ అభ్యర్థి పాలడుగు విజయ పేరును 34వ డివిజన్ కార్పొరేటర్ డి.నీతా పటేల్ ప్రతిపాదించగా, అదే పార్టీకి చెందిన 10వ డివిజన్ కార్పొరేటర్ పురిమిట్ల రాణి బలపరిచారు.ఒకరే నామినేషన్ వేయడంతో సూత్రప్రాయంగా ఏకగ్రీవమయ్యారు. అయినప్పటికీ ఆమె ఎన్నికపై చేతులెత్తాలని కలెక్టర్ కోరడంతో డిప్యూటీ మేయర్ పదవికి ప్రతిపాదిత అభ్యర్థి పాలడుగు విజయను 62 మంది కారొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 93 మంది సభ్యులు చేతులు పైకెత్తి ఆమోదం తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ఆమె చేత ప్రమాణం చేయించారు.కమిషనర్ ఎం. జయకృష్ణ, ఎన్నికల అబ్జర్వర్ వరప్రసాద్,ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, తుడా ఛైర్మన్ దివాకర రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరి ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, తాతయ్య గుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, కార్పొరేషన్ అదనపు కమిషనర్ యు. శారదాదేవి, స్మార్ట్‌సిటీ జీఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు జేబీ శ్రీనివాస్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు ఊరేగింపుగా తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టౌన్ క్లబ్ కూడలి లోని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత బాలాజీ కాలనీ కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి,ఎస్వీయూ ముందున్న అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
తిరుపతిని ఆదర్శనగరంగా మారుస్తా
ఇతర నగరాలకు దీటుగా తిరుపతిని ఆదర్శవంతంగా అభివృద్థి చేసి చూపుతానని జేబీ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.‘అత్యధిక మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా.వంద రోజుల ప్రణాళికతో అభివృద్థిని చేసి చూపిస్తా. తిరుపతిని మరింత అభివృద్థి చేయాలని లోకేశ్ ఆదేశించారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేశ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాను. త్వరలో యూడీసీ సమస్యకు పరిష్కారం చూపుతా’ అని హామీ ఇచ్చారు.