హేమలత అను నేను.....
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:15 AM
తిరుపతి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా మాజీ ఎమ్మెల్యే హేమలత జడ్పీ తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నాగలాపురం టీడీపీ జడ్పీటీసీ హేమలత ఛైర్‌పర్సన్‌గా, సూళ్ళూరుపేట బీజేపీ జడ్పీటీసీ ఆరణి కిషన్‌రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యేక సమావేశానికి మొత్తం 29 మంది జడ్పీటీసీలు హాజరు కాగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వారందరితో ఒకేసారి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు.
వేడుకగా జడ్పీ తొలి పాలకవర్గ ప్రమాణస్వీకారం
అధ్యక్షురాలిగా హేమలత, ఉపాధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ప్రత్యేక సమావేశానికి హాజరైన 29 మంది జడ్పీటీసీలు
ఓటింగ్‌కు దూరంగా ఇద్దరు వైసీపీ సభ్యులు
తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా మాజీ ఎమ్మెల్యే హేమలత జడ్పీ తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నాగలాపురం టీడీపీ జడ్పీటీసీ హేమలత ఛైర్‌పర్సన్‌గా, సూళ్ళూరుపేట బీజేపీ జడ్పీటీసీ ఆరణి కిషన్‌రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యేక సమావేశానికి మొత్తం 29 మంది జడ్పీటీసీలు హాజరు కాగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వారందరితో ఒకేసారి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. హాజరైన 29 మంది జడ్పీటీసీల్లో 23 మంది టీడీపీ, ఇద్దరు జనసేన, ఒకరు బీజేపీ, ఇద్దరు వైసీపీ, ఒకరు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. ఇందులో వైసీపీకి చెందిన కోడూరు, పెనగలూరు జడ్పీటీసీలు అంబటి మురళి, దువ్వూరి సుప్రజ్డ ఓటింగులో పాల్గొనకుండా మిన్నుకుండిపోయారు. ఛైర్‌పర్సన్‌గా నామినేషన్ వేసిన హేమలతకు ఆ ఇద్దరు మినహా 22 మంది టీడీపీ, ఇద్దరు జనసేన, ఒక బీజేపీ, ఇక ఇండిపెండెంట్ జడ్పీటీసీలు కలిపి మొత్తం 26 మంది మద్దతుగా చేతులెత్తడంతో ఆమె గెలుపొందినట్టు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసిన ఆరణి కిషన్‌రెడ్డికి అంతేమంది మద్దతు పలకడంతో ఆయన వైస్ ఛైర్మన్‌గా గెలిచినట్టు కలెక్టర్ ప్రకటించారు. వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తొట్టంబేడు జడ్పీటీసీ రావిళ్ళ మునిరాజనాయుడు సమావేశానికి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు.జడ్పీ సీఈవో శోభన్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ రమణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు జడ్పీటీసీలు గైర్హాజరు
కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక సమావేశానికి ఐదుగురు జడ్పీటీసీలు గైర్హాజరయ్యారు. వారిలో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా మిగతా నలుగురూ వైసీపీ సభ్యులు. రేణిగుంట బీజేపీ జడ్పీటీసీ జీపాలెం తేజోవతి, ఎర్రావారిపాలెం, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, పెళ్ళకూరు వైసీపీ జడ్పీటీసీలు ఊటుకూరి రెడ్డెమ్మ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, బాలం యుగంధర్‌రెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సమావేశానికి రాలేదు.
ఏకగ్రీవమయ్యాక చేతెలెత్తడం ఎందుకో!
తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జడ్పీ ప్రత్యేక సమావేశంలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించిన తీరు చర్చకు దారి తీసింది. సమావేశానికి 29మంది జడ్పీటీసీలు వచ్చారు. వారిలో ఇద్దరు మాత్రమే వైసీపీ సభ్యులు. మిగతా 27 మందిలో 26 మంది కూటమి సభ్యులే. ఏకైక ఇండిపెండెంట్ సభ్యుడు గుత్తి నరసింహులు సైతం కూటమికి అనుకూలంగానే వ్యవహరించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానానికి హేమలత ఒక్కరే నామినేషన్ వేశారు. అలాగే వైస్ ఛైర్మన్ స్థానానికి ఆరణి కిషణ్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీ లేనందున ఇద్దరూ ఏకగ్రీవంగా గెలుపొందినట్టే. ఆ మేరకు ప్రకటించాల్సిన అధికారులు మళ్ళీ సభ్యులను చేతులెత్తి మద్దతు తెలపాలని కోరడం ప్రశ్నార్థకంగా మారింది. పదవులకు రెండో నామినేషన్ వుంటే పోటీ అనివార్యమయ్యేది.అప్పుడు సభ్యులను చేతులెత్తమని ఏ అభ్యర్థికి ఎంతమంది మద్దతు ఇచ్చారనేది లెక్కించి గెలుపోటములను ప్రకటిస్తారు. ఇక్కడ పోటీయే లేనపుడు సభ్యులను చేతులెత్తమని కోరడం చర్చనీయాంశంగా మారింది.
కూటమి నేతల గైర్హాజరు
జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల కార్యక్రమానికి కూటమి పార్టీల నేతలు పలువురు గైర్హాజరయ్యారు.జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, సత్యవేడు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు పూర్తిగానూ, నగరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు పాక్షికంగానూ వున్నాయి. తొమ్మిది మంది ఎమ్మెల్యేలూ కూటమికి చెందిన వారే. అయితే సూళ్ళూరుపేట, రైల్వే కోడూరు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, అరవ శ్రీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాత్రమే హాజరయ్యారు. టీడీపీ నుంచీ శాప్ ఛైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, సత్యవేడు టీడీపీ ఇంఛార్జి శంకర్‌రెడ్డి మాత్రమే కలెక్ట్టరేట్‌కు వచ్చి కూటమి జడ్పీటీసీలను అభినందించారు. ఎన్నికలు ముగిశాక ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలెవరూ కనిపించలేదు. జిల్లావ్యాప్తంగా కూడా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలెవరూ రాకపోవడం గమనార్హం. హేమలత సొంత నియోజకవర్గం కావడంతో సత్యవేడు నుంచీ మాత్రం పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. జడ్పీ తొలి అధ్యక్ష పీఠాన్ని ఓ దళిత మహిళ అధిష్ఠించిన వేళ ఆ సామాజికవర్గానికి చెందిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు సైతం కనిపించకపోవడం గమనార్హం.