Share News

చెడ్డీగ్యాంగ్‌ కోసం వేట

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:02 AM

జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.

చెడ్డీగ్యాంగ్‌ కోసం వేట

- మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు

మదనపల్లె క్రైం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. మదనపల్లెలోని పీఅండ్‌టీకాలనీకి చెందిన రిటైర్డు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ కె.ఆర్‌.రవీంద్ర ఇంట్లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. చెడ్డీగ్యాంగ్‌కు చెందిన నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా, కప్‌బోర్డు తలుపులు బద్దలుకొట్టి అందులో ఉన్న రూ.30లక్షల బంగారు, వెండి నగలతో పాటు రూ.25వేలు నగదుతో పారిపోయారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చెడ్డీగ్యాంగ్‌ కొన్ని రోజుల కిందట పీలేరులో రెండు ఇళ్లలో చోరీలు చేశారు. ఇటీవల కలికిరి, వాల్మీకిపురం మండలాల్లో రెక్కీ నిర్వహించి మూడు ఇళ్లలో చోరీకి యత్నించారు. రాత్రిలో గస్తీ కాస్తున్న పోలీసులు కనుగొని వారిని పట్టుకునేలోపే పరారయ్యారు. ఆ తర్వాత మదనపల్లెలో తిరుగుతూ పీఅండ్‌టీకాలనీలో పథకం ప్రకారం చోరీ చేశారు. చెడ్డీలు వేసుకుని, ముసుగు కప్పుకుని చోరీలు చేస్తున్నారు. చేతులకు గ్లౌజులు కూడా ధరించి ఉన్నట్లు సీసీఫుటేజీల్లో స్పష్టంగా తెలుస్తోంది. వీటిని పరిశీలించిన పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ పనేనంటూ నిర్థారణకు వచ్చారు. క్లూస్‌ టీం సిబ్బంది సేకరించి ఇచ్చిన వేలిముద్రలను పరిశీలించారు. చెడ్డీగ్యాంగ్‌ పనేనంటూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా అంతటా జల్లెడ పడుతున్నారు. జాతీయ రహదారుల్లోని చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో నాకాబందీ, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వారిపై కర్ణాటక, తమిళనాడులోనూ పలు కేసులు ఉండటంతో అక్కడి నుంచి పారిపోయి రాయలసీమ జిల్లాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.

Updated Date - Aug 15 , 2026 | 01:02 AM