శేషాచల అటవీ ప్రాంతానికి చేరువగా పెరుగుతున్న జనావాసాలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:00 AM
ప్రకృతి సమతుల్యానికి ముప్పు ఎదురవుతోంది. శేషాచల అటవీప్రాంతంలో వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకమవుతోంది. అడవుల విస్తీర్ణం జనావాసాలతో చిక్కిపోతూ పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి అటవీ రేంజ్‌లో కపిలతీర్థం పక్కనే ఉన్న జీవకోన, బీడీకాలని, ఎస్‌ఎల్‌వీ నగర్, ఉపాధ్యాయ నగర్, తిమ్మినాయుడుపాళెం, బీటీఆర్ కాలనీ, తిరుమలనగర్, రిక్షాకాలనీ.. ఇలా కరకంబాడీ వరకు జనావాసాలు పెరిగిపోయాయి
అంతరించిపోతున్న మూగజీవాలు
పర్యావరణానికి ఎదురవతున్న సవాలు
తిరుపతి(కపిలతీర్థం), జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సమతుల్యానికి ముప్పు ఎదురవుతోంది. శేషాచల అటవీప్రాంతంలో వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకమవుతోంది. అడవుల విస్తీర్ణం జనావాసాలతో చిక్కిపోతూ పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి అటవీ రేంజ్‌లో కపిలతీర్థం పక్కనే ఉన్న జీవకోన, బీడీకాలని, ఎస్‌ఎల్‌వీ నగర్, ఉపాధ్యాయ నగర్, తిమ్మినాయుడుపాళెం, బీటీఆర్ కాలనీ, తిరుమలనగర్, రిక్షాకాలనీ.. ఇలా కరకంబాడీ వరకు జనావాసాలు పెరిగిపోయాయి.శేషాచల అడవుల సరిహద్దుకు చేరువయ్యాయి. ఇక్కడ ఆక్రమణలు అదే తీరుగా పెరిగాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో కబ్జాదారులు అటవీప్రాంతాలను సైతం ఆక్రమించుకుంటున్నారు. దర్జాగా పక్కాభవనాలు కట్టేసుకుంటున్నారు. సరిహద్దులు లేని అటవీభూముల ఆక్రమణలకు కొందరు రెవెన్యూ అఽధికారుల అండదండలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
.
జనావాసాల్లోకి వన్యప్రాణలు
మరోపక్క శేషాచల కొండల్లో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఆహారం, నీటి కోసం ఇవి అటవీ ప్రాంతాల నుంచి జనావాసాలకు దగ్గరగావస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ తిరిగే కుక్కల కోసం చిరుతలు తరచూ వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతి డివిజన్‌లో దాదాపు 40కిపైగా చిరుతలున్నాయని సమాచారం. ఎస్వీ యూనివర్శిటీ, నగరవనం, కపిలతీర్థం నుంచి కరకంబాడి వరకు అటవీప్రాంతానికి సమీపంలో వున్న జనావాసాల్లోకి 12 చిరుతలు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎలుగుబంట్లు కూడా సమీప ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి.ఆహార వ్యర్థాల కోసం కుక్కలు, పందులు వస్తుండగా, వీటికోసం చిరుతలు వస్తున్నాయి.
ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు
తిరుమల కాలినడక దారిలో ఏడవ మైలు వద్ద పగలూరాత్రీ తేడా లేకుండా వన్య ప్రాణుల సంచారం పెరిగింది. జింకలు, దుప్పులు సైతం జనావాసాలకు వచ్చి కుక్కలకు చిక్కుతున్నాయి. మరికొన్ని వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. అటవీ ప్రాంత సమీపంలో ఉంటున్న కొందరు జింకలు, అడవిపందులు, కుందేళ్లు, పక్షులను వేటాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు మరో అడుగు ముందుకేసి అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు వేసి మరీ వేటాడుతున్నారు. విస్తరిస్తున్న జనావాసాల మూలంగా వన్యప్రాణుల సంతతికే ఎక్కువ ముప్పు వాటిల్లుతోందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క పనపాకం, భాకరాపేట, తిరుమల ఘాట్‌రోడ్లలో ఏనుగుల సంచారం ఆందోళన కలిగిస్తోంది.
తరచూ హెచ్చరిస్తున్నాం
శేషాచల అటవీ సమీపాన ప్రజా నివాసాలు పెరిగాయి. ఇక్కడ ప్రజల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. నిషేధిత అటవీ ప్రాంతాల్లోకి రావద్దని, వన్యప్రాణులను వేటాడవద్దని తరచూ హెచ్చరిస్తున్నాం. అడవుల్లోకి వచ్చినా, వన్యప్రాణులను వేటాడినా చట్టప్రకారం శిక్షను ఎదుర్కొంటారు. కొందరి చర్యల వల్ల మూగజీవాల రక్షణ కష్టంగా ఉంది. చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. అవసరమైతే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం.
-సాయిబాబా, జిల్లా అటవీశాఖ అధికారి