Share News

నిమ్మనపల్లె సొసైటీలో భారీస్కామ్‌..!

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:54 PM

నకిలీ బంగారంపై రుణాల మంజూరు మచ్చ మాయక ముందే..అదే సహకార సొసైటీలో మరో భారీస్కామ్‌ వెలుగులోకి వచ్చింది.

నిమ్మనపల్లె సొసైటీలో భారీస్కామ్‌..!
నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘకార్యాలయం

మదనపల్లె, మార్చి 5(ఆంధ్రజ్యోతి): నకిలీ బంగారంపై రుణాల మంజూరు మచ్చ మాయక ముందే..అదే సహకార సొసైటీలో మరో భారీస్కామ్‌ వెలుగులోకి వచ్చింది. రైతులు, ప్రజల సొత్తుకు కాపలాగా, అంతకు మించీ జవాబుదారీగా ఉండాల్సిన అధికారే చేతివాటం ప్రదర్శించారు. రూ.లక్ష కాదు..రూ.కోటి కాదు..ఏకంగా రూ.2కోట్లకుపైగా స్వాహా చేశారు. తర్వాత తమకేమీ తెలినట్లు సైలెంట్‌గా ఉండిపోయారు. బంగారం తాకట్టుపై ఆ సొసైటీ.. రైతులు, ప్రజలకు రుణాలు ఇచ్చింది. తమ అవసరాలు తీరిపోయాక..రైతులు, కస్టమర్లు తాము తీసుకున్న అప్పునకు వడ్డీతో సహా సొసైటీకి చెల్లించి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకున్నారు. అంతవరకూ బాగానే వుంది. ఈ సొమ్మును సొసైటీ ఖాతాలో జమ చేయాల్సివుండగా, సీఈవో స్వాహా చేశారు. అయితే క్యాష్‌బుక్‌లో ఎంట్రీ, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కానీ బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. అనుమానం వచ్చిన నోడల్‌ అధికారి విచారణలో చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరింతలోతుగా వెళ్తే, రూ.2కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో రూ.2కోట్లకుపై బంగారు సొమ్ములు మాయం అయ్యాయి. సొసైటీ వ్యాపార లావాదేవీల విస్తరణకు చిత్తూరు కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)..ఆయా సింగిల్‌విండోలకు రుణాలు మంజూరు చేస్తుంది. ఇందులోభాగంగా నిమ్మనపల్లె సొసైటీకి అవసరాన్ని బట్టి రూ.కోట్లు మంజూరు చేసింది. ఈ సొమ్ముతో వ్యాపారం మొదలు పెట్టిన ఈ సొసైటీ...రైతులు, ఖాతాదారులకు బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చింది. తమ అవసరాలు తీరాక..వారంతా తీరిగీ తాము తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లింపు తాకట్టు బంగారాన్ని విడిపించుకున్నారు. ఆ మొత్తాను సొసైటీ అకౌంట్‌కు జమ చేయకుండా సీఈవో తన జేబులో వేసుకున్నారు. ఇలా వందిమందకుపైగా బంగారు ఖాతాలు క్లోజ్‌ అయ్యాయి. అంటే ఒక రైతు, లేదా కస్టమర్‌..ఒకటి కంటే ఎక్కువ ఖాతాలపై అప్పు తీసుకున్నా..70 మందికిపైగా ఉండొచ్చని అంచనా. ఇలా వందఖాతాల నుంచి రూ.2కోట్లకుపైగా సొమ్ములు రకవరీ అయ్యాయి. అయితే అవి సొసైటీ ఖాతాకు జమ కాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

క్రిమినల్‌ చర్యలకు డీసీసీబీ సీఈవో ఆదేశం

నిమ్మనపల్లె సొసైటీలో 70 మందికిపైగా కస్టమర్లు, వందకుపైగా ఖాతాల నుంచి రూ.2కోట్లకు పైగా వెంటనే రికవరీ అయిందనేది అంతులేని ప్రశ్న.గా మిగిలింది. మదనపల్లె డీసీసీబీ బ్రాంచీ నోడల్‌ అధికారి .. సొసైటీలో విచారణ చేపట్టారు. ఇందులో ఈమేరకు స్కామ్‌ జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ విషయాన్ని డీసీసీబీ సీఈవో శంకర్‌బాబుకు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దీన్ని పరిశీలించిన సీఈవో..మదనపల్లె డీసీసీబీ బ్రాంచీ మేనేజర్‌కు, అన్నమయ్య జిల్లా డీసీవో, మదనపల్లె డివిజన్‌ సహకారశాఖ అధికారి, నిమ్మనపల్లె త్రీమెన్‌ కమిటీకి పంపించారు. సొసైటీ సీఈవోపై వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నకిలీ బంగారు రుణాలతో అప్రమత్తం

నిమ్మనపల్లె సింగిల్‌విండోలో నకిలీ బంగారంపై రుణాలు ఇచ్చినట్లు ఇటీవల జరిగిన రీ-అప్రైంజింగ్‌లో వెలుగులోకి వచ్చింది. మొత్తం బంగారంపై రుణాలు తీసుకున్న ఖాతాలలో ఎనిమిదింటికి సంబంధించి రూ.30లక్షలు మేర ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ మొత్తాన్ని అప్పటికప్పుడు రికవరీ చేయించారు. ఇందులో సీఈవోతో, అదేశాఖలోని ఓ కీలకమైన అధికారి పాత్రఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం డీసీసీబీలోని డీఎల్‌ఐసీ కమిటీ సిఫార్సు మేరకు నిమ్మనపల్లె సొసైటీ త్రీమెన్‌ కమిటీ ఆ సొసైటీ సీఈవో హరినాథ్‌రెడ్డిని ఇటీవల సస్పెండ్‌ చేసింది. ఇది జరిగి రెండువారాలు కూడా జరగ ముందే, అదే బంగారం రుణాలకు సంబంధించిన సొమ్ము స్వాహాయాణం వెలుగులోకి రావడం సహకారశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలావుండగా, నకిలీ బంగారం వ్యవహారం వెలుగులోకి రావడంతో రైతులు, ఖాతాదారులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే అక్కడ తాకట్టు పెట్టిన బంగారు రుణాన్ని వెనువెంటనే విడిపించుకున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా రైతులు, ఇతర ఖాతాదారులు సొసైటీ లేదా బ్యాంకుల్లో బంగారంపై రుణాలు తీసుకుంటే వడ్డీ చెల్లించిన రెన్యువల్‌ చేస్తుంటారు. అంతే కాని రెండువారాల లోపే వందఖాతాలకుపైగా విడిపించుకునే అవకాశమే లేదు. అది కూడా సొసైటీలో అంటే అంత త్వరగా తీసుకెళ్లే అవకాశమే లేదు. అయితే ఇక్కడి సొసైటీలో నకిలీ బంగారంపై రుణాలు తీసుకున్న అంశాన్ని ఆంధ్రజ్యోతి ఇటీవల వెలుగులోకి తేవడంతో అసలు గుట్టు రట్టయింది. దీనిపై అప్రమత్తమైన ఖాతాదారులు తాకట్టు బంగారాన్ని విడిపించుకున్నట్లు తెలుస్తోంది. ఆశాఖ అధికారులు కూడా ఇదే భావిస్తున్నారు. అదే ఇక్కడి సీఈవోకు కలిసొచ్చినట్లుంది.

నేడు పోలీసులకు ఫిర్యాదు..కేసు నమోదు

వందఖాతాలు, రూ.2కోట్లకుపైగా సొమ్ము స్వాహాకు సంబంధించిన వివరాలను ఆశాఖఅధికారులు సేకరించారు. డీసీసీబీ, సహకారశాఖ, సొసైటీ త్రీమెన్‌ కమిటీ..నోడల్‌ అధికారి విచారణ నివేదికపై మూడురోజుల పాటు సుధీర్ఘంగా చర్చించారు. అందుకు సంబంధించిన వివరాలు సేకరించారు. దీనిపై శుక్రవారం నిమ్మనపల్లె పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదుకు చర్యలు చేపడుతున్నారు. విచారణ అధికారి చెబుతున్నట్లు ఇంత తక్కువ సమయంలో అన్ని ఖాతాలు రిలీజ్‌ అయ్యే అవకాశం తక్కువ. అయితే ఇది ఎన్ని రోజులుగా జరుగుతోంది? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత? అనేదానిపై పోలీసుల విచారణతోపాటు సహకారశాఖ ఏర్పాటు చేసే 51 విచారణలో తేలాల్సివుంది. మరోవైఉ ఇన్ని ఖాతాలు రోజువారి రిలీజ్‌ అవుతుంటే, ఆ డబ్బులను సీఈవో సొసైటీ ఖాతాకు జమ చేయకుంటే, సొసైటీలోని మిగిలిన సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందులో సీఈవోతోపాటు మిగిలిన సిబ్బంది పాత్రపై కూడా ఆశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:54 PM