తిరుపతిలో భారీ రీసెర్చి సెంటర్
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:03 AM
పరిశోధనా రంగాల్లో తిరుపతి ఖ్యాతి మరింత ఇనుమడించనుంది.
తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీ ఫస్ట్’ కేంద్రం ఏర్పాటుతో శాస్త్ర సాంకేతిక విద్యా, పరిశోధనా రంగాల్లో తిరుపతి ఖ్యాతి మరింత ఇనుమడించనుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చి ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పేరిట తిరుపతిలో అతి పెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. తన క్యాంపు కార్యాలయంలో ఏరో స్పేస్ - డిఫెన్స్, ఐటీ -డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సలహాదారులతో శుక్రవారం సమావేశమైన సీఎం చంద్రబాబు.. ఈ ప్రతిపాదనను అంగీకరించారు. తిరుపతి ఐఐటీ, ఐసర్ సంయుక్తంగా ఈ రీసెర్చి కేంద్రం నిర్వహించే ప్రతిపాదనపైనా లోతుగా చర్చించారు. ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల డివైజె్‌స-సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. వీటిల్లో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా, నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆయా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండటంతో ఈ రీసెర్చి కేంద్రం ఏర్పాటు అనివార్యమవుతోంది. ఇందులో నూతన పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగులను అందించేలా శిక్షణ ఇవ్వనున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సాయం కూడా తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.
పెరగనున్న తిరుపతి ప్రతిష్ట
ఇప్పటికే ఎస్వీయూ, పద్మావతీ మహిళా వర్సిటీ, ఎస్వీ వేద వర్సిటీ, వెటర్నరీ వర్సిటీ, అగ్రికల్చర్ కాలేజీ, ఎస్వీ మెడికల్, ఆయుర్వేదిక్ కాలేజీలు, పద్మావతీ మెడికల్ కాలేజీ తదితరాలతో పాటు జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఐఐటీ, ఐసర్, జాతీయ సంస్కృత వర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ వంటివి తిరుపతిలో ఉన్నాయి. వీటితో తిరుపతికి ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొచ్చింది. దుగరాజపట్నంలో పోర్టు, అక్కడే షిప్ బిల్డింగ్ పరిశ్రమ కూడా మంజూరైన సంగతి తెలిసిందే. మరోవైపు తొట్టంబేడు మండలం రౌతు సూరమాల వద్ద స్పేస్ సిటీ ఏర్పాటవుతోంది. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఈఎంసీ 1, 2 ఏర్పాటయ్యాయి. అందులోనూ శ్రీసిటీలోనూ పలు ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమలన్నింటిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో లేక చెన్నై తదితర ప్రాంతాల నుంచీ నియమించుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఏపీ ఫస్ట్ రీసెర్చి కేంద్రం ఏర్పాటైతే జిల్లాలోని పరిశ్రమలకూ నిపుణులైన ఉద్యోగుల కొరత తీరే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా యువత నైపుణ్యాల శిక్షణ కోసం, పరిశోధనల కోసం తిరుపతికి రానుండటంతో విద్య, శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల్లో తిరుపతి ఖ్యాతి మరింత పెరగనుంది.