ఇతరులకు ఎలా సహాయం చేయాలి?
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:25 AM
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పీ4 పథకానికి ఏడాది పూర్తయింది
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పీ4 పథకానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ అధ్యక్షతన వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మోహన్‌కుమార్, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, జిల్లాస్థాయి అధికారులు, మార్గదర్శుల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. సమాజంలో ‘నాకేంటి?’ అనే భావన తగ్గి.. ‘ఇతరులకు ఎలా సహాయం చేయాలి?’ అనే దృక్పథం పెరగాలని సుమిత్‌కుమార్ ఆకాంక్షించారు. సమాజంలోని పేదరికాన్ని తగ్గించడమనేది పీ4 కార్యక్రమం ఉద్దేశమన్నారు. జిల్లాలో చేసిన సర్వే ప్రకారం.. 10- 12 శాతం కుటుంబాలు ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి ప్రధానమైన సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వీటి పరిష్కారానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, సేవాభావం కలిగిన వారు ముందుకు రావాలన్నారు. సాధారణ ప్రజలూ ఇతరులను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో సహాయం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ‘బెంగళూరుకు చెందిన ఒక సంస్థ వందమంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించింది. ఎన్‌ఆర్‌ఐ సంస్థలు పాఠశాలలను దత్తత తీసుకుని విద్యాప్రమాణాలను పెంపొందిస్తున్నాయి’ అని కొన్ని ఉదాహరణలను కలెక్టర్ ప్రస్తావించారు. జిల్లాలో విశిష్ట సేవలందిస్తున్న కొందరు వ్యక్తులు, సంస్థలను సత్కరించారు. మార్గదర్శకులను కకలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంగారు కుటుంబాల మార్గదర్శకులు మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధి శివకృష్ణ, టీవీఎస్ కంపెనీ ప్రతినిధి శ్రావణి, ఎన్‌ఆర్‌ఐ సంస్థ ప్రతినిధి మధు, జిల్లాలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో కడా ఆధ్వర్యాన నిర్వహించిన పి-4 వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్‌చైర్మన్ పీఎస్ మునిరత్నం, కడా పీడీ వికాస్ మర్మత్ మాట్లాడారు. స్వయంగా సీఎం చంద్రబాబు కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు. సమావేశానికి హాజరైన బంగారు కుటుంబాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు.
‘జీడీనెల్లూరు నియోజకవర్గంలో 13,364 పేదరిక కుటుంబాలను గుర్తించాం. వారిలో 9,380 కుటుంబాలను 988 మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. మిగిలిన 3,984 బంగారు కుటుంబాల దతత్తకు దాతలు ముందుకు రావాలి’ అని జిల్లా చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు కోరారు. గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు మార్గదర్శులను సన్మానించారు.
పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో పీ4 వార్షికోత్సవం జరిగింది. ‘10,056 కుటుంబాలను గుర్తించగా, ఇప్పటివరకు 640 కుటుంబాలు లబ్ధి పొందాయి. మిగిలిన వారిని త్వరలోనే అన్నిరంగాల్లో ఆదుకుంటాం’ అని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు.