మాంసం తినేదెలా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:51 AM
నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ శుక్రవారం జరిపిన తనిఖీలతో అసలు బండారం బట్టబయలైంది.తిరుపతి పీపీ చావడి వీధిలో అనధికారికంగా నడుస్తున్న మటన్ మార్కెట్ నుంచి నగరమంతా మాంసం సరఫరా అవుతున్నట్టు తేలింది.
- ఆరోగ్య శాఖ తనిఖీల్లో బయటపడ్డ మాంసం చూసి జనంలో ఆందోళన
- ఆదివారం తగ్గిపోయిన అమ్మకాలు
రోజుకు రెండు వేటలు కొట్టే మటన్ షాపులో రెండు తలలు, 8 కాళ్లు ఉండాలి. కానీ నాలుగు తలలు, 16 కాళ్లు కనిపిస్తాయి. అవెక్కడ నుంచి వచ్చాయి?
తిరుపతిలో చిన్నపాటి నాన్ వెజ్ సెంటర్ల నుంచి కొన్ని స్టార్ హోటళ్ల వరకూ ఎప్పుడు వెళ్లినా పాయ, తల కూర వేడివేడిగా ఉంటుంది. ఇంత మొత్తంలో వీటిని ఎక్కడనుంచి తెప్పించి వండి వడ్డిస్తున్నారు?
నగరపాలక సంస్థ లెక్కల ప్రకారం తిరుపతిలో 237 మటన్, చికెన్ రిటైల్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో వందలోపే మటన్ షాపులున్నాయి. వారాంతంలో సుమారు 150 పొట్టేళ్లు, మేకపోతులు మాత్రమే అధికారికంగా కోస్తున్నారు. మరి పెద్దఎత్తున తలలు, కాళ్లు ఎలా వస్తున్నాయి?
నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ శుక్రవారం జరిపిన తనిఖీలతో అసలు బండారం బట్టబయలైంది.తిరుపతి పీపీ చావడి వీధిలో అనధికారికంగా నడుస్తున్న మటన్ మార్కెట్ నుంచి నగరమంతా మాంసం సరఫరా అవుతున్నట్టు తేలింది.అక్కడ కన్పించిన నీచావహ దృశ్యాలతో జనంలో ఇన్నాళ్లూ తాము తిన్నదేంటనే స్పష్టత వచ్చింది.ఇక్కడి స్లాటర్ హౌస్‌ను సీజ్ చేశాక చుట్టుపక్కల ఇండ్లలోనే ఫ్రీజర్లలో మాంసం నిల్వ వుంచి అమ్ముతున్నట్లు సమాచారం. దీనిపైనా అధికారులు దృష్టి సారించాల్సి వుంది.
తిరుపతి సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):తిరుపతిలోని మటన్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లోనే డ్రైనేజీ కాలువలు మాంసపు వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుండడంతో ఆ ప్రాంతవాసులు కార్పొరేషన్ పీజీఆర్‌ఎస్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పొటేళ్ల మాంస అవశేషాలతోనే కాలువలు బ్లాక్ అవుతున్నాయని శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికులు గుర్తించారు. హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో తనిఖీ చేశారు. కుళ్లిపోయిన మాంసం, పాచిపోయిన పొటేళ్ల, మేకల తలకాయలు, కాళ్లు, బోటి వంటి పదార్థాలు బయటపడడంతో మాంసాహార ప్రియులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హోటళ్లలో తాము ఇన్నాళ్లూ తిన్న వంటకాలు గుర్తొచ్చి ఆందోళనకు గురయ్యారు.దీని ప్రభావం ఆదివారం నాన్‌వెజ్ హోటళ్లపై కనిపించింది.వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు నిర్వాహకులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా తలకూర, బోటి కూర, పాయ వంటి ప్రత్యేక వంటకాల అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. హోటళ్లకు వచ్చిన వారు కూడా ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇది తాజా మాంసమేనా? ఎంతకాలం నిల్వ ఉంచారంటూ విక్రయదారులను ప్రశ్నిస్తున్నారు.నాణ్యమైన, తాజా మాంసంతోనే వంటలు చేస్తున్నామని చెబుతున్న హోటల్ నిర్వాహకులు కొందరి నీచ వ్యాపారంతో అందరూ చెడ్డపేరు మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మటన్ అమ్మకాలు కూడా మార్కెట్‌లో ఆదివారం గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
హైదరాబాద్, చెన్నైనుంచి దిగుమతి
హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కాళ్లు, తల, బోటి కూరలకు పెద్దగా డిమాండు ఉండదు. దీంతో చిన్నస్థాయి పట్టణాలకు తక్కువ ధరకు (తల రూ.200 నుంచి 300 వరకు) వాటిని ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుపతికి కంటైనర్, రైల్వే పార్సిల్ ద్వారా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అవి రెండు వారాలు నిల్వ చేసినట్టుగా, కాళ్లు,తలలను నీళ్లతో శుభ్రం చేసి, రక్తం కన్పించేలా రసాయనాలు కలిపి తరలిస్తున్నట్టు చెబుతున్నారు. మటన్ మార్కెట్‌లోని 12 దుకాణాలలోనే ఎక్కువగా ఇవి నిల్వ ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు టన్ను బరువు కలిగిన కుళ్లిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు.ఇన్నాళ్లూ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. దీనివెనుక ఎవరెవరి హస్తం వుందోకూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆరోగ్య శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని, తరచూ తనిఖీలు నిర్వహించాలని నగరవాసులు కోరుతున్నారు.
వెటర్నరీ డాక్టర్ అనుమతించినవే అమ్మాలి
లీలామహల్ సర్కిల్ సమీపంలోని ఫిష్ మార్కెట్ వద్ద వున్న తిరుపతి నగర పాలక సంస్థకు చెందిన జంతువధశాలలోనే పొటేళ్లు, మేకలు కట్ చేయాలి.వాటి ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ అధికారి పరిశీలించి అనుమతించిన తరువాతే దుకాణాల్లో అమ్ముకోవాలి. ఇకపై తరచూ తనిఖీలు చేపడుతుంటాం.కుళ్లిన మాంసం అమ్మకాలు పునరావృతమైతే కఠిన చర్యలకూ వెనకాడం.
-డాక్టర్ యువ అన్వేష్, హెల్త్ ఆఫీసర్