Share News

ఆ కుటుంబానికి ఎంత కష్టం?

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:06 AM

చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నా యువకుడు. మినీ వ్యాను డ్రైవరుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందడంతో, ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఆ కుటుంబానికి ఎంత కష్టం?
జగదీష్‌ (ఫైల్‌ ఫొటో)

పక్కకు తిరిగిన ట్రాక్టరును ఢీకొని మినీవ్యాను డ్రైవరు మృతి

గంగవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నా యువకుడు. మినీ వ్యాను డ్రైవరుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందడంతో, ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గంగవరం మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన జగదీష్‌(24) మినీవ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం టమోటాల లోడుతో పలమనేరు మార్కెట్‌కు బయలుదేరాడు. గోశాల వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ సడన్‌గా రోడ్డుకు అడ్డంగా కుడివైపునకు మళ్లింది. దీంతో వెనుకే వస్తున్న మినీవ్యాన్‌ ఆ ట్రాక్టరును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగదీ్‌షను వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి చనిపోగా.. తల్లి కూలిపనులు చేస్తూ పెంచింది. తల్లి కష్టాన్ని చూసి జగదీష్‌ మధ్యలోనే చదువు ఆపేసి.. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. తల్లికి చేదోడుగా ఉంటూ డ్రైవింగ్‌ నేర్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చెల్లికి పెళ్లి చేశాడు. రెండేళ్ల క్రితం అతడికీ పెళ్లయింది. ప్రమాద విషయం తెలియగానే కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.

Updated Date - Aug 04 , 2026 | 01:06 AM